యాదగిరిగుట్ట – తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందాడని భక్తులు చెబుతుంటారు. యాదమహర్షి పేరు మీదగా యాదగిరిగుట్టగా పిలవబడుతుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఉదయం 10గంటలకు విశేష ఆరాధన, స్వస్తివాచకం, రక్షాబంధనం, కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6.30గంటలకు మ్రుత్తికా ప్రాశనం, అంకురార్పణం ఉంటుంది. ఇక ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఈ నెల 8న తిరుకల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకొని.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.
అలాగే రెండవ తేదీన ఉదయం 8గంటలకు అగ్నిప్రభ, 11 గంటలకు ధ్వజారోహణం ఉంటుంది. 3వ తేదీన సాయంత్రం 6.30గంటలకు బేగి ఊరేగింపు, దేవతాశ్రయణం, హవనం ఉంటుంది. మార్చి 4వ తేదీన ఉదయం 9గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణ ప్రారంభమవుతుంది. రాత్రి 7గంటలకు శేష వాహన సేవలు ఉంటాయి. మార్చి 5వ తేదీన ఉదయం 9గంటలకు కూర్మావతార అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ ఉంటుంది.
మార్చి6వ తేదీన ఉదయం 9గంటలకు కృష్ణావతార అలంకార సేవ, రాత్రి 7గంటలకు పుష్ప వాహన సేవ ఉంటాయి. మార్చి 7వ తేదీన ఉదయం 9గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. వీటితోపాటు మార్చి 8వ తేదీన ఉదయం 9గంటలకు వామనావతార అలంకార సేవ, రాత్రి 7గంటలకు అశ్వ వాహన సేవ , స్వామివారి ఎదుర్కొలు ఉత్సవం ఉంటుంది. మార్చి 9న ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార, హనుమంత వాహన సేవ, రాత్రి 8గంటలకు గరుడ వాహన సేవ, అనంతరం స్వామివారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 10వ తేదీన ఉదయం 9గంటలకు త్రివిక్రమావతార అలంకారం, గరుడ సేవ,రాత్రి 8గంటల నుంచి దీప ఉత్సవం, రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. మార్చి 11వ తేదీన ఉదయం 10.30మహాపూర్ణాహుతి, చక్రస్నానం, రాత్రి 7గంటలకు శ్రీ పుష్పయాగం, మార్చి 11వ తేదీన ఉదయం 10గంటలకు అపరాజిత శత కలశాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రంగార దోలోత్సవం, ఉత్సవ సమాప్తి ఉంటాయని యాదగిరిగుట్ట ఈవో భాస్కరరావు తెలిపారు.
ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రధానాలయాన్ని, ఆలయ మండపాలను, ముఖద్వారాలను, గోపురాన్ని విద్యుద్దీపాలు, వివిధ రకాల పూలమాలలు, అరటి, మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండపైకి వాహనాలను ఉచితంగా అనుమతించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆలయ ఈవో ఏపూరి భాస్కర్‌రావు వెల్లడించారు.