C-DEP | భారత్‌లో అడుగంటుతున్న బారైట్ నిల్వలు…

దేశ ఇంధన భద్రతకు ముప్పు – C-DEP హెచ్చరిక

భారతదేశంలో ఉన్న ఏకైక ప్రధాన బారైట్ (Barite) నిల్వలు పూర్తిగా తగ్గిపోయే దశకు చేరుకున్నాయని సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ (C-DEP.in) సంచలన నివేదికను విడుదల చేసింది. దేశీయంగా తవ్వకాలు విపరీతంగా పెరగడం వల్ల, ప్రపంచంలో 10 సంవత్సరాల కంటే తక్కువ బారైట్ నిల్వలు ఉన్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మిగిలిందని, ఇది దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు తీవ్ర ముప్పు అని నివేదిక హెచ్చరించింది.

చమురు అన్వేషణలో బారైట్ పాత్ర…

చమురు, సహజ వాయువు వెలికితీత ప్రక్రియలో బారైట్ అత్యంత కీలకమైన ఖనిజం. ముఖ్యంగా అధిక పీడనం ఉండే బావులను స్థిరీకరించడంలో దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ దేశీయంగా బారైట్ సరఫరా నిలిచిపోతే, అండమాన్ బేసిన్, కృష్ణా-గోదావరి బేసిన్లలో ప్రస్తుతం జరుగుతున్న చమురు అన్వేషణ కార్యక్రమాలు తక్షణమే నిలిచిపోయే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

మంగంపేట గనిలో వేగంగా తగ్గుతున్న నిల్వలు..

భారతదేశ మొత్తం బారైట్ సంపదలో 95 శాతం ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట (కడప జిల్లా) గనిలోనే ఉంది. అయితే, ఈ గనిలో నిల్వలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి. 2015లో బారైట్ నిల్వలు 49 మిలియన్ టన్నులు కాగా.. 2024లో 23 మిలియన్ టన్నుల కంటే తక్కువ న‌మోద‌య్యాయి.

కేవలం ఒక దశాబ్ద కాలంలోనే నిల్వలు 53 శాతం తగ్గిపోయాయి. భవిష్యత్తు అవసరాల కోసం వ్యూహాత్మక నిల్వలను (Strategic Reserves) నిర్మించకుండా, అనియంత్రితంగా ఎగుమతులు చేయడమే ఈ దుస్థితికి కారణమని నివేదిక ఎత్తిచూపింది.

ఐఐటీ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బారైట్ నిల్వల తగ్గుదల కేవలం ఖనిజ సమస్య కాదు, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. భవిష్యత్తులో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే బారైట్ నిల్వలను కాపాడుకోవడం అత్యంత కీలకం,” అని అన్నారు.

భారతదేశం నుంచి అత్యధికంగా బారైట్ అమెరికాకు ఎగుమతి అవుతోంది. APMDC ఉత్పత్తిలో సింహభాగం అమెరికా అవసరాలకే వెళుతోంది. దీనికి తోడు, బారైట్ ఆదాయాన్ని చూపి APMDC దాదాపు రూ.10,000 కోట్ల విలువైన బాండ్లను సేకరించింది. ఈ బాండ్ల చెల్లింపుల కోసం నిల్వలను కాపాడుకోవడం కంటే, తవ్వకాలను పెంచి ఆదాయం పొందడంపైనే సంస్థ దృష్టి సారించాల్సి వస్తోందని నివేదిక విశ్లేషించింది.

2016లో చైనా తన నిల్వలను కాపాడుకోవడానికి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తన బారైట్ అవసరాల్లో 44 శాతాన్ని భారత్ నుంచే పొందుతోంది. కానీ రష్యా, ఇరాన్, అమెరికా వంటి దేశాలు తమ నిల్వలను దశాబ్దాల పాటు కాపాడుకునేలా ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి. “దేశీయ అన్వేషణను కాపాడుకోవడానికి భారత్ కూడా దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి,” అని C-DEP అధ్యక్షుడు డా. జైజిత్ భట్టాచార్య సూచించారు.

భారత్‌లో ఇంకా అన్వేషించాల్సిన సుమారు 22 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఈక్వివలెంట్ వనరులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ వనరులను వెలికితీయడానికి దాదాపు 600 మిలియన్ టన్నుల బారైట్ అవసరమని అంచనా వేసింది. అంటే, భవిష్యత్తులో దేశీయ చమురు, సహజ వాయు పరిశోధనల విజయవంతమైన నిర్వాహణ కోసం బారైట్ సరఫరా కీలకంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో, నివేదిక కొన్ని కీలక సూచనలు చేసింది. ముందుగా, ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధించాల్సిన అవసరాన్ని పేర్కొంది. విచ్చలవిడి, అనియంత్రిత ఎగుమతులు దేశీయ నిల్వలను తగ్గించే ప్రధాన కారణంగా ఉన్నందున, వాటిపై అడ్డుకట్ట వేసి నిల్వలను రక్షించాలి అని పేర్కొంది.

APMDC బాండ్ల పునర్వ్యవస్థీకరణ కోసం ఆర్థిక మార్పిడి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించింది. బాండ్లపై ఆధారపడకుండా, నిల్వల నిర్వహణను వ్యూహాత్మకంగా కొనసాగించడం అవసరం. మూడవ సూచనగా, బారైట్‌ను నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ (NCMM)లో చేర్చి, దీనిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలని నివేదిక ప్రస్తావించింది. ఇది భవిష్యత్తులో దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.

Leave a Reply