NDA Alliance | ప్రజాదర్బార్‌లో 215 అర్జీలు
- ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారు నిదర్శనం
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
NDA Alliance | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ‘ప్రజాదర్బారు’ల నిర్వహణ నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బారు) నిర్వహించారు. ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. మొత్తం 215 అర్జీలు సమర్పించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వారంలో ఒక రోజు క్రమంతప్పకుండా మండల కేంద్రాల్లో ప్రజాదర్బారు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పీజీఆర్ఎస్) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఇబ్రహీంపట్నంలో రూ.55 కోట్లతో ఇంటింటికీ నీటి కుళాయి పనులు త్వరలో ప్రారంభిస్తారన్నారు. దీనికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం గాజులపేట, ఈలప్రోలు, మైలవరం పూరగుట్ట ప్రాంతాల్లో కట్టిన కాలనీలలో ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

