- ఆర్సీబీకి వరుస షాక్ లు..
డబ్ల్యూపీఎల్ 3వ సీజన్ ను విజయంతో ప్రారంభించిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమౌతుంది. నేడు గుజరాత్ జేయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ దారుణంగా ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు నమోదు చేసింది. బెంగళూరు బ్యటర్లలో కనికా అహుజా (33) టాప్ స్కోరర్. రాఘవి బిస్త్ (22), జార్జియా వేర్హామ్ (20 నాటౌట్) పరుగుల చేశారు.
అయితే, కెప్టెన్ స్మృతి మందన (10) మరోసారి నిరాశపరిచింది. గత మ్యాచ్ల్లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎలిస్ పెర్రీ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యింది. గుజరాత్ బౌలర్లలో తనూజా కన్వర్, డియాండ్రా డాటిన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆష్లీ గార్డనర్, కష్వీ గౌతమ్ తలో వికెట పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ జట్టు విజయంలో కెప్టెన్ ఆష్లే గార్డనర్ కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ ఆష్లే 31 బంతుల్లో 58 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించింది. మరోవైపు ఫోబ్ లిచ్ ఫీల్డ్ (30 నాటౌట్) ఆకట్టుకుంది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్, జార్జియా వేర్హామ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అయితే, ఈ మ్యాచ్లో ఆర్సీబీపై విజయం సాధించినా.. గుజరాత్ జట్టు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ కారణంగా అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ (6 పాయింట్లు, 0.780), ఢిల్లీ క్యాపిటల్స్ (6 పాయింట్లు, -0.223), ఆర్సీబీ (4 పాయింట్లు, 0.155) , యూపీ వారియర్స్ (4 పాయింట్లు, -0.124) , గుజరాత్ జేయింట్స్ (4 పాయింట్లు, -0.450) ఉన్నాయి