Chennaraopet | ‘బాండ్’ మోగిస్తున్న సర్పంచ్ అభ్యర్థి

Chennaraopet | ‘బాండ్’ మోగిస్తున్న సర్పంచ్ అభ్యర్థి
Chennaraopet | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : పాత ముగ్దంపురం గ్రామ పంచాయతీ కాంగ్రేస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ననుమాస కర్ణాకర్ బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఉప సర్పంచ్ గా పని చేసినప్పుడు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులు, గ్రామ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వంటి హామీలను దైవ సాక్షిగా ప్రమాణం చేసి వంద రూపాయల విలువైన బాండ్ పేపర్ పై సంతకం చేసి ప్రజలకు పంచి పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయింది. ప్రధానంగా గ్రామాన్ని చెన్నారావుపేట మండలంలో కలిపేందుకు కృషి చేస్తాను. గురజాల ఎంపీటీసీ స్థానం నుండి గ్రామాన్ని విడదీసి చెన్నారావుపేటలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు.
గ్రామంలో పెండింగ్ లో ఉన్న అనేక సీసీ రోడ్ల నిర్మాణాలు చేయిస్తానని, గ్రామస్తుల సహకారంతో కోతుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఎస్సీ కాలనీ, కాశిండ్లలో 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పిస్తానన్నారు. ఊరిలో అందరికీ అందుబాటులో ఉండేలా అత్యాధునిక సౌకర్యాలతో గ్రంథాలాయాన్ని నిర్మిస్తానని, ప్రతి ఆరు నెలలకొకసారి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తానన్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ ఆటస్థలం ప్రత్యేకంగా ఏర్పాటు చేయిస్తానని, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణం పూర్తి చేయిస్తానని, మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలు ప్రతిష్టిస్తానన్నారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కాటమయ్య దేవుడి విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తానని, గ్రామపంచాయతీ నిధులతోపాటు ఎమ్మెల్యే కోటా, ఎంపీ కోటా నిధులు, వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బాండ్ పేపర్ పై హామీఇచ్చారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని మీ ఇంట్లో ఒకడిగా ఐదేళ్లు అభివృద్దే ధ్యేయంగా పని చేస్తానని అన్నారు.
