YOUTH | పోస్టర్ ఆవిష్కరణ

YOUTH | పోస్టర్ ఆవిష్కరణ

    • ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి వ్యతిరేకంగా

    భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : దేవన్‌పల్లి గ్రామంలో “యంగ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్” ఆధ్వర్యంలో, రాబోయే ఎన్నికల్లో మద్యం మరియు డబ్బు పంపిణీకి వ్యతిరేకంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పిల్లలు, సర్పంచ్ అభ్యర్థులు స్వయంగా పాల్గొని రాజ్యాంగ స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ప్రభోదా సుమేర్ మాట్లాడుతూ ” దేవన్‌పల్లిలో గ్రామంలో కేవలం ఒక పోస్టర్ ఆవిష్కరణ కాదు, ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన పట్టాభిషేకం. మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కు విలువను, దాని పవిత్రతను కాపాడటానికి ‘యంగ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్’ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.

    గ్రామ స్థాయిలో అవినీతిని అంతం చేస్తేనే, దేశ స్థాయిలో మార్పు సాధ్యమవుతుంది. ఈ రోజు దేవన్‌పల్లి గల్లీలో యువత వినిపిస్తున్న ఈ నిజాయితీ గొంతుక, రేపు ఢిల్లీ వరకు వినిపించాలి. సర్పంచ్ అభ్యర్థులతోనే ‘డబ్బు ఇవ్వం -మందు పోయం’ అని ప్రతిజ్ఞ చేయించి, వారితోనే ఈ పోస్టర్లను ఆవిష్కరింపజేయడం అనేది రాజ్యాంగానికి దక్కిన నిజమైన గౌరవం. స్ఫూర్తిదాయక సందేశం (ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఫర్ ది పీపుల్) “500 రూపాయలకు తల వంచితే… 5 ఏళ్లు బానిసలుగా బతకాల్సిందే!”గ్రామ ప్రజలారా, ఆలోచించండి…రాజ్యాంగం మనల్ని “ప్రజలే ప్రభువులు” అని చెప్పింది. కానీ ఎన్నికలప్పుడు ఆ గులాబీ నోటుకు, ఆ మందు సీసాకు ఆశపడి మన ఓటును అమ్ముకుంటే, మరుక్షణం నుంచే మనం ప్రభువుల స్థానం నుంచి ‘బానిసల’ స్థానానికి పడిపోతాం.

    డబ్బులిచ్చి గెలిచిన నాయకుడు, రేపు మన ఊరికి రోడ్డు వెయ్యడు, బడి కట్టడు…ఎందుకంటే అతను కొన్నది మీ ఓటును మాత్రమే కాదు, మీ ప్రశ్నించే హక్కును కూడా. ! ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం పై మన చేతిలో పడే 500 రూపాయలు, రేపు మన పిల్లలకు దక్కాల్సిన నాణ్యమైన చదువును, మంచి వైద్యం (హాస్పిటల్)ను దూరం చేస్తాయి. దేవన్‌పల్లి యువత, చిన్న పిల్లలతో కలిసి ఈ రోజు రోడ్ల మీదకు వచ్చింది ఇందుకే. మన పిల్లలు పెరిగి పెద్దయ్యాక అవినీతి లేని సమాజంలో బతకాలంటే, ఈ రోజు మనం నిజాయితీగా ఓటు వేయాలి. ఓటు అనేది అడుక్కునే భిక్ష కాదు, అది రాజ్యాంగం మన చేతికి ఇచ్చిన వజ్రాయుధం. దాన్ని అమ్ముకోవద్దు. దేవన్‌పల్లిలో “యంగ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్” వెలిగించిన ఈ నిజాయితీ జ్యోతి, తెలంగాణలోని ప్రతి పల్లెకు పాకాలి.

    Leave a Reply