హైదరాబాద్ ను పట్టించుకోని సర్కార్…

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగర పాలనపై జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమానికి హృదయంలాంటి హైదరాబాద్‌ను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కవిత ఆరోపించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, గతంలో ఉన్న 7 వేల సిటీ బస్సులను ఉచిత బస్సు పథకం పేరుతో 3,500కి తగ్గించారని విమర్శించారు.
దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్‌టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. నగరంలో పారిశుధ్యం, భద్రత లోపించడంపై కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వీధి కుక్కల బెడద పెరిగిందని, ఈ ఏడాది ఇప్పటివరకు 1,21,997 మందికి పైగా కుక్కకాట్లకు గురయ్యారని గణాంకాలను తెలిపారు. గత రెండేళ్లుగా క్రైమ్ రేట్ పెరిగిందని, వృద్ధులు, ఒంటరివారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ వినియోగం పెరిగిందని, బాపు ఘాట్, సనత్‌నగర్ వంటి ప్రాంతాలు అడ్డాగా మారాయని ఆమె ఆరోపించారు. యాకత్‌పురలో మంచి నీరు, మురుగు నీరు కలిసిపోవడం వంటి మౌలిక వసతుల లోపాలను ఆమె ప్రస్తావించారు.
యూసఫ్‌గూడ స్టేడియం, మలక్‌పేట్ గంజ్ ప్రాంతంలో రోడ్లు లేకపోవడం, జియాగూడలో గోశాలల సమస్యలు వంటి అనేక ప్రాంతీయ సమస్యలపై ఆమె ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో రూ.5 లక్షల కోట్లు చెల్లిస్తే, తిరిగి రూ.3,76,715 కోట్లు మాత్రమే ఇచ్చారని, సుమారు రూ.59,200 కోట్లు తక్కువ ఇచ్చారని ఆమె ఆరోపించారు.
అంతేకాకుండా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన లక్ష ఇళ్ల పథకంలో మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
