బీజేపీ అభ్యర్థితోనే అభివృద్ధి సాధ్యం..

మక్తల్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ గ్రామ అభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయ అనితను ఆదరించి గెలిపించాలని మక్తల్ మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బోయ అనితతో కలిసి ఆయన ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని కొండయ్య విమర్శించారు. పంచాయతీలకు రూపాయి ఇవ్వని పార్టీలను గెలిపించాల్సిన అవసరం ఉందా అని ఓటర్లు ఆలోచించాలని సూచించారు.
నిరంతరం ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్న అనితను ఆదరించడం గ్రామస్తుల బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసి అభివృద్ధిని పట్టించుకోని వ్యక్తులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారని, అలాంటి వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలని కొండయ్య పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.
ఖానాపూర్ గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ఇతరుల మాయమాటలను నమ్మకుండా గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీ బలపరిచిన బోయ అనితను సర్పంచ్‌గా గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని ఖానాపూర్ ప్రజలను కొండయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, బీజేపీ నాయకులు బాల్చేడ్ మల్లికార్జున్, బ్యాటరీ రాజు, బోయ వెంకటప్ప, బోయ బాలప్ప, మనోహర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
