Police | మానవత్వం చాటుకున్న పోలీసులు

Police | మానవత్వం చాటుకున్న పోలీసులు

  • ఓటర్లకు భద్రతతో పాటు చేయూత
  • ఓటేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు పోలీసుల సాయం

Police | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి. ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు భద్రతా ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, తమ మానవీయతను ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగ (ప్రత్యేక అవసరాలున్న) ఓటర్లకు పోలీసులు స్వయంగా సేవలందించారు. ఆటోల నుంచి కిందకు దించటం, వీల్‌చైర్లలో పోలింగ్ బూత్‌ల వరకు తీసుకువెళ్లడం, సరైన మార్గనిర్దేశం చేయటం వంటి కార్యక్రమాలతో ఖాకీలు సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

భద్రతను పర్యవేక్షిస్తూనే ఓటర్లలో ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని మొత్తం ఏడు మండలాలైన బెల్లంపల్లి, తాండూర్, కాసీపేట, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి లలో పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల బందోబస్తులో మొత్తం 761 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

Leave a Reply