Arrested | 8 మంది డ్రగ్ వినియోగదారుల అరెస్ట్
- డ్రగ్-డిటెక్షన్ కిట్‌లను ఉపయోగించి పరీక్షలు
- ఎన్డీపీఎస్ చట్టం 1985 క్రింద అదుపులో నింధితులు
Arrested | హైదరాబాద్, ఆంధ్రప్రభ : డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని శనివారం తెలంగాణ ఈగల్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈగల్ ఫోర్స్, తెలంగాణ హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, బోరబండ పోలీసులతో కలిసి, హైదరాబాద్‌లోని బోరబండ ఇందిరానగర్ ఫేజ్-2 వద్ద 8 మంది డ్రగ్స్ వినియోగదారులను అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు, తెలంగాణ ఈగల్ ఫోర్స్ బృందం బోరబండ పోలీసులతో కలిసి త్వరితగతిన ఆపరేషన్ నిర్వహించింది.
ఈ ఆపరేషన్‌లో, ఇందిరానగర్, బోరబండలోని ఒక ఇంటి డాబాపై 8 మంది వ్యక్తులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. విచారణలో నిందితులు తాము చెడు స్నేహాల కారణంగా గంజాయి తాగడానికి అలవాటు పడ్డామని ఒప్పుకున్నారు. గత కొన్ని నెలలుగా, వారు అపరిచిత సరఫరాదారు నుంచి గంజాయిని సేకరించి, దానిని వినియోగించడానికి క్రమం తప్పకుండా డాబాపై గుమిగూడుతున్నట్లు వారు వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన రోజు, ప్రధాన నిందితుడు విక్కీ గంజాయిని తీసుకురాగా, అతను , అతని ఏడుగురు స్నేహితులు దానిని సేవించారు. పట్టుబడిన 8 మంది వ్యక్తులపై అక్కడికక్కడే డ్రగ్-డిటెక్షన్ కిట్‌లను ఉపయోగించి పరీక్షలు నిర్వహించగా.. ఎన్డీపీఎస్ చట్టం, 1985 ప్రకారం నిషేధించబడిన సైకోట్రోపిక్ పదార్థమైన టీహెచ్సీ (టెట్రాహైడ్రోకాన్నబినాల్) ఉనికిని ఫలితాలు ధృవీకరించాయి.
8 మంది నిందితులను స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ కమిషనరేట్‌లోని బోరబండ పోలీసులకు అప్పగించారు. వారికి పూర్తిగా కౌన్సెలింగ్ ఇచ్చి, డి-ఎడిక్షన్ , పునరావాసం కోసం ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఐఎమ్హెచ్) లోని డ్రగ్ ట్రీట్‌మెంట్ క్లినిక్ (డీటీసీ) కు పంపారు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రధాన సరఫరాదారులని గుర్తించి, పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసు వివరాలను శనివారం తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీం ప్రకటించింది. నింధితుల్లో విక్కీ, మల్లికార్జున్, శివ, షరీఫ్, అబ్రహాం, నాగిరెడ్డి, వినోద్ లు బోరబండకి చెందినవారు కాగా జగద్గిరిగుట్టకు చెందిన సాయి మణికంఠలు ఉన్నారు.

