Dogs | బాబోయ్.. వీధి కుక్కలు
- చిన్నారులు, వృద్ధులపై తరచూ దాడులు
- కోళ్లను, పందులను వెంటాడి చంపుతున్న కుక్కలు
- భయాందోళనలో కదిరి జనం
- మున్సిపల్ అధికారులు కళ్లప్పగింత
Dogs | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఎప్పుడు, ఎక్కడ నుంచి కుక్కలు దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయాందోళనలతో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు పిల్లలపై దాడులు చేయడంతో పాటు, కోళ్లు, పందులు వంటి పశువులను వెంటాడి చంపుతున్న ఘటనలు జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి.
వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక ప్రాంతాలకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ధర్మవరం, హిందూపురం, ముదిగుబ్బ, పుట్టపర్తి, కదిరి తదితర పట్టణాలు, మండలాల్లో అనేకమంది ప్రజలు కుక్కకాటుకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. ముఖ్యంగా కదిరి పట్టణంలో ఇటీవల వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గత కొద్ది రోజుల క్రితం కదిరి పట్టణంలో ఓ చిన్నారి బాలికపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మరచిపోకముందే తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
కదిరి పట్టణంలోని నిజాంవళి కాలనీకి చెందిన యాసిన్ అనే ఐదేళ్ల బాలుడిపై శనివారం వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి ఎడమ చెవిని పూర్తిగా కొరికివేయడంతో పాటు, రెండు కాళ్ల తొడలకు తీవ్రంగా కాట్లు వేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సంఘటనకు కొద్ది గంటల ముందు కదిరి పట్టణంలోని అడపాల వీధిలో గల శ్రీ షిరిడి సాయి ప్రైవేట్ పాఠశాల సమీపంలో కొన్ని కుక్కలు ఒక పందిని వెంటాడి మరీ చంపి, దానిని పీక్కుతింటున్న దృశ్యాలు అక్కడున్న యువకులను కలచివేశాయి. ఈ భయానక ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ దృశ్యాలు చూసిన ప్రజలు తీవ్ర భయానికి లోనయ్యారు. ఇంతలోనే నిజాంవళి కాలనీలో చిన్నారిపై కుక్కల దాడి జరగడం పట్టణవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనల నేపథ్యంలో కదిరి పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న కుక్కల నుంచి తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఉదయం వేళల్లో నడకకు వెళ్లే వృద్ధులు కుక్కల భయంతో బయటకు రావడానికి వెనుకాడుతున్నారు.
ఈ సంఘటనపై సీపీఎం నాయకులు తీవ్రంగా స్పందించారు. నిజాంవళి కాలనీలో కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యాసిన్‌ను సీపీఎం నాయకులు జి.ఎల్. నరసింహులు, బాబ్ జాన్, ముస్తాక్ అలీ, రామ్మోహన్, ఆంజనేయులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కదిరి పట్టణంలో గత కొంతకాలంగా కుక్కల దాడులు పెరుగుతున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. పత్రికలు, మీడియా ద్వారా ఎన్నిసార్లు వార్తలు వచ్చినా అధికారుల్లో చలనం లేకపోవడం వల్లే చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారని ఆరోపించారు.
ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ప్రత్యేకంగా పిల్లలు నివసించే కాలనీల్లో కుక్కల బెడదను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల భద్రతను కాపాడటం అధికారుల బాధ్యత అని, నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.మొత్తంగా చూస్తే, శ్రీ సత్య సాయి జిల్లాలో వీధి కుక్కల సమస్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

