నల్లగొండ : ఎస్ ఎల్ బి సి టన్నెల్ నిరంతరం నీటి ఊట వస్తుంటంతోనే తమ హాయాంలో అనుకున్నంత వేగంగా పనులు జరగలేదని మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.. నీటి ఊట తోడేందుకు ఏటా రూ కోటిన్నర ఖర్చు చేశామని తెలిపారు. అయినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.
సీనియర్ నేత హరీశ్ రావు నేతృత్వంలో ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన వద్దకు నేటి ఉదయం బయలుదేరే ముందు నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు.. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారాచూశానన్నారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామని గుర్తు చేశారు..
కుట్రలతోనే ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ నిర్మాణం .
నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని ఆరోపించారు. టన్నెల్ కూలి ఎనిమిది మంది ప్రాణాలు లోపల చిక్కుకుని ఉన్నా పట్టించుకోకుండా ఉన్న మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రాజెక్టు పై అవగాహన లేక మంత్రులు పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ మంత్రి వాటర్‌లో నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమోడియన్ అయ్యారన్నారు. గోడకు చెవులు పెట్టడం..సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ ప్రమాదంపై ఎటువంటి రాజకీయ చేయమని, అక్కడి పరిస్థితులను పరిశీలించి , సహాయకార్యక్రమాలకు అవసరమైన సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు జగదీశ్ రెడ్డి .