మంత్రి కొండా సురేఖపై నాన్–బెయిలబుల్ వారెంట్

  • పల్లి కోర్టు సంచలన ఆదేశాలు
  • కేటీఆర్ పరువు నష్టం కేసులో కొత్త మలుపు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంప‌ల్లి కోర్టు షాకిచ్చింది. మంత్రి కొండా సురేఖకుపై నాంపల్లి కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల సమయంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకరమైన, వ్యక్తిత్వాన్ని దూషించే వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడినట్లు సమాచారం.

కేసు విచారణ సందర్భంగా, కోర్టు పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ, మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం అత్యంత తీవ్రమైన వ్యవహారం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

దీంతో, 2026 ఫిబ్రవరి 5లోపు మంత్రి కొండా సురేఖ కోర్టులో తప్పనిసరిగా ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశిస్తూ, హాజరుకాకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ వేడెక్కింది.

వారెంట్ డ్రామా! నిజం ఏమిటంటే..

తనకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని, కోర్టుకు హాజరు కావాలని మాత్రమే సమాచారం అందిందని ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న వార్తలు మొదటగా ప్రచారంలోకి వచ్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటుచేసుకుందని ఆ వార్తల సారాంశం.

గురువారం ఈ కేసు విచారణకు రాగా, మంత్రి కొండా సురేఖ‌ గైర్హాజరుపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారనే వార్తలు వెలిశాయి.

అయితే, ఈ ప్రచారాన్ని కొండా సురేఖ కొద్దిసేపటికి ఖండించారు. కోర్టు తనకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు హాజరుకావాలని మాత్రమే చెప్పిందని ఆమె వెల్లడించారు. తనపై తప్పుడు, దుష్ప్రచారం జరుగుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వివాదంలో క్షమాపణలు చెప్పి సమస్యకు ముగింపు పలికిన సురేఖ… కేటీఆర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Leave a Reply