KTR | ఆటో డ్రైవర్లకు రామన్న ఆత్మీయ భరోసా…

- డ్రైవరన్నలకు కేటీఆర్ రూ.5 లక్షల బీమా కార్డులు…
- నెలకు రూ.1,000 హామీ ఎక్కడ?
- ప్రమాద బీమా రద్దుతోనే 93 మంది ఆటో డ్రైవర్లు మృతి
- కాంగ్రెస్ నిర్లక్ష్యమే ఆటో డ్రైవర్ల మరణానికి అసలు కారణం
ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లనే 93 మందికి పైగా డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా, ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మృతుల ఆత్మలకు నివాళులు అర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు రెండేళ్లకు సంబంధించిన బకాయి రూ.1,560 కోట్లు అప్పు పడి ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు.
“రెండేళ్లలో మార్పు మార్పు అంటూ మోసం ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది” అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, మష్రత్ అలీ ఆటోలో ఎక్కి హామీలు ఇచ్చారని, నేడు అలీ రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకుంటున్నాడని కేటీఆర్ విమర్శించారు.

బీఆర్ఎస్ తరపున రూ. 5 లక్షల బీమా
కేటీఆర్ ప్రధానంగా ప్రమాద బీమా రద్దు అంశాన్ని ప్రస్తావించారు. గత అక్టోబర్ నుంచి ప్రమాద బీమా రద్దయిందని, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టకుండా బీమాను రద్దు చేసి కార్మికులను గాలికొదిలేసిందని ఆరోపించారు. ఈ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకనే 93 మందికిపైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా, జిల్లాలోని 5,000 మంది ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ తరపున రూ. 5 లక్షల ప్రమాద బీమా కార్డులను కేటీఆర్ అందించారు. ఈ ప్రీమియం సొంత డబ్బులతో చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, జిల్లాలో అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానని ప్రకటించారు. గతంలో కేసీఆర్ గీతన్నలకు, నేతన్నలకు, రైతులకు బీమా ఇచ్చిన కార్మిక పక్షపాతి అని గుర్తు చేశారు.
ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే, హైదరాబాద్లో మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. “కాంగ్రెస్వాడు ఊరికే ఇవ్వడు, గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
