Byreddy Sabari | పగటి పూట రైళ్లు నడపండి

Byreddy Sabari | పగటి పూట రైళ్లు నడపండి
పార్లమెంట్‌లో గళం విప్పిన ఎంపీ శబరి
Byreddy Sabari | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల నుంచి గుంతకల్లుకు పగటి పూట రైళ్లు నడపాలని, వయా బేతంచెర్ల మీదుగా ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌ను కలుపుతూ కర్నూలు(దుపాడు) వరకు కొత్త రైలు మార్గం వేయాలని బుధవారం పార్లమెంట్‌లో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, డాక్టర్ బైరెడ్డి శబరి (Byreddy Sabari) గళమెత్తారు. నంద్యాల నుంచి గుంతకల్లు వైపు నాలుగు రైళ్లు ఉన్నాయని, ఆ నాలుగు రైళ్లు చాలా రాత్రి సమయాల్లో నడుసున్నాయన్నారు. అన్ని రైళ్లు అర్ధరాత్రి 12:55, 1:30, 2:20, రాత్రి 8:20కి ఒక రైలు ఉందన్నారు. దీంతో రోజువారీగా వెళ్లే రైలు ప్రయాణికులు, విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి దయచేసి ఈ మార్గానికి చాలా ఉపయోగకరంగా ఉండే రోజువారీ పగటిపూట మెమో రైలు లేదా ప్రయాణికుల రైలును నడిపించాలని అభ్యర్థిస్తున్నానని పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్‌ను ఎంపీ కోరారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సమాధానం ఇస్తూ.. ఈ సమస్యను గతంలోనే పరిశీలించానన్నారు. నంద్యాలలోని నిర్వహణ సౌకర్యాలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. గుంతకల్లులో ఐసీఎఫ్ కోచ్‌ల (ICF COACH) కోసం కొంత నిర్వహణ సౌకర్యం ఉందన్నారు. కానీ నంద్యాలలో నిర్వహణ సౌకర్యం లేదన్నారు. కాబట్టి, కొంత పరిష్కారాన్ని కనుగొన్నామని, ఈ సమస్యను పరిష్కరించే మార్గాన్ని కనుగొనమని తాను రైల్వే నిపుణులు బృందాన్ని కోరానని సభకు వివరించారు. తాను ఫీల్డ్ అధికారులతో కూడా త్వరలో వివరంగా చర్చిస్తానన్నారు. వీలైనంత త్వరలో పరిష్కారం కనుగొనబడిన వెంటనే, ఎంపీకి తెలియజేస్తానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే నంద్యాల నుంచి కర్నూలు కు కొత్త రైలు మార్గం ఏర్పాటు చేయాలని ఎంపీ పార్లమెంట్ లో రెండవ ప్రశ్నగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు.
ప్రస్తుతం నంద్యాల నుంచి డోన్ మీదుగా కర్నూలుకు రైలు (Train) మార్గం దాదాపు 130 కిలోమీటర్ల దూరం ఉందని, నంద్యాల నుండి వయా బేతంచెర్ల మీదగా ఓర్వకల్లు పారిశ్రామిక హాబ్ ను కలుపుతూ (దుపాడు ) కర్నూలు వరకు కొత్త రైలు మార్గం నిర్మిస్తే 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, ఈ కొత్త రైలుకు 2023 లోనే డీపీఆర్ నమోదు చేసి, వాస్తవానికి మంజూరు దశలో ఉందని, ఈ సమస్య పరిష్కారం చేసి కొత్త రైలు మార్గం వేయాలని పార్లమెంట్ లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్టవ్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లును పారిశ్రామిక హాబ్ గా ప్రకటించి అవసరమైన నిధులు, భూమి కేటాయించిందని, కాబట్టి, డీపీఆర్ కు నిధుల కేటాయింపు చేసి నంద్యాల నుంచి వయా బేతంచెర్ల మీదుగా కర్నూలుకు కొత్త రైలు మార్గం పూర్తి చేయాలని పార్లమెంట్ లో కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ తెచ్చారు.
