Skating | పుత్తూరు బాలుడు.. ప్రపంచ రికార్డు..
Skating | పుత్తూరు, ఆంధ్రప్రభ : పుత్తూరు పట్టణానికి చెందిన అంధ బాలుడు మురారి హర్షవర్ధన్ (10) స్కేటింగ్‌లో ప్రపంచానికే స్ఫూర్తిదాయక విజయాన్ని అందించాడు. కంటిచూపు లేకపోయినా కర్ణాటక – ఆంధ్ర బార్డర్ నంగిలి నుండి 230 కిలోమీటర్లు వరకు స్కేటింగ్ (Skating) చేస్తూ ప్రపంచ రికార్డును నెలకొల్పి పుత్తూరుకు గౌరవం తీసుకువచ్చాడు. స్కేటింగ్ కోచ్ ప్రతాప్ సారథ్యంలో శిక్షణ పొందుతున్న ఈ చిన్నారి అసామాన్య ప్రతిభను గుర్తిస్తూ పుత్తూరులో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురారి హర్షవర్ధన్‌కు బలిజ అభ్యుదయ సేవా సంఘ సభ్యులు శాలువాలు కప్పి, పూలదండలు వేసి, స్వీట్స్ తినిపిస్తూ ఆత్మీయంగా సత్కరించారు.
ఈ ఘన కార్యక్రమంలో జాతీయ కాపు సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి పి. గోపి రాయల్ (Gopi Royal) పుత్తూరు బలిజ సంఘం సీనియర్ నాయకులు, సంఘం గౌరవాధ్యక్షులు కొట్టే రాజేంద్ర నాయుడు, రాష్ట్ర బలిజ సంఘం రైతు విభాగం ఉపాధ్యక్షుడు జి. కృష్ణయ్య, సభ్యులు సత్య, ఢిల్లీ బాబు పాల్గొని చిన్నారి ప్రతిభను అభినందించారు. అంధత్వాన్ని అధిగమించి ప్రపంచ స్థాయి రికార్డు నెలకొల్పిన మురారి హర్షవర్ధన్ భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు ఆశీర్వదించారు.

