Telangana | నీలకంఠశ్వరుడికి వైభవంగా పూజలు… కిటకిటలాడుతున్న ఆలయాలు

హైదరాబాద్ – మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా తెలంగాణ లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తులకు కొంగుబంగారాన్ని అందిస్తున్న మహాశివుడిని హర హర మహాదేవ.. అంటూ నీలకంఠ స్వామిని భక్తిప్రపత్తులతో కొలిచేందుకు చిన్నా, పెద్ద అందరూ బుధవారం తెల్లవారుజామున స్నానాలు చేసి ఆదిదంపతులను దర్శించుకునేందుకు శివాలయాలకు క్యూ కట్టారు. ఆలయాలను విద్యుద్దీపాల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. జాగరణ ఉండే భక్తుల కోసం పలు ఆలయాల్లో ఎల్‌ఈటీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజనలు, సంకీర్తలను నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాశివుడి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయాల్లో స్వామివారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయాల వద్ద ఇలాంటి ఇబ్బందులు భక్తులు ఎదుర్కోకుండా పెద్ద ఎత్తున ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. వేములవాడ తోపాటు ఉమ్మడి జిల్లాలోని శివాలయాలు స్వామి వారి దర్శనం కోసం నాలుగు నుండి ఆరుగంటల సమయం పడుతుంది. భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. పెద్దపల్లి శివాలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక శివనామ స్మరణతో రాజన్న క్షేత్రం మారు మోగుతోంది. ఓం నమశ్శివాయతో దక్షిణ కాశీ వేములవాడ మారుమొగుతోంది. సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయం అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

మంచిర్యాల:
జిల్లా కేంద్రంతో పాటు గూడెం, లక్షేట్టి పేట, చెన్నూరు గోదావరి నది తీరాల్లో భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. వేలాల మల్లిఖార్జున స్వామి ఆలయం, కత్తరశాల మల్లన్న, బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

నిర్మల్ జిల్లా:
బాసరలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గోదావరి నది తీరంలో భక్తుల పుణ్య స్నానాలు చేస్తున్నారు. సోన్, ఖానాపూర్ గోదావరి నది తీరాల్లో భక్తుల రద్దీ నెలకొంది. జిల్లా కేంద్రంలోని శివాలయాలు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. కదిలి పాప హరేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లలోనిలుచున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కొమురం భీం జిల్లా:
ఈజ్‌గాం శివ మల్లన్న, వాంకిడి శివ కేశవ ఆలయాల్లో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. జాతరలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, పెన్ గంగా నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

ఖమ్మం జిల్లా:
మహా శివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కూసుమంచి గణపేశ్వరాలయం, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయం, పెనుబల్లి మండలం నీలాద్రీశ్వరస్వామి ఆలయం, మధిర మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం, స్నానాల లక్ష్మీ పురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాలలో మహా శివునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహా శివుని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా: ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *