వెలగపూడి – రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ, తల్లికి వందనం సహా.. అనేక పథకాల అమలును ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం అమలు వ్యవహారంపై మాట్లాడిన సీఎం.. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. పథకాన్ని అమలు చేస్తామన్నారు. మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. రైతుకు భరోసా కల్పించే విషయంలో తాము చెప్పినట్లుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు సీఎం. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూ. 6000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 14 వేలు కలిపి మొత్తం రూ. 20వేలు ఇస్తామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరోసారి ఉద్ఘాటించారు. ఇక దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేలు పింఛను పెంచామన్నారు.
సాధారణ పింఛన్‌ను రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచామన్నారు. రూ. 33 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పింఛన్లు ఇచ్చే దేశంలోనే ఏకైక కార్యక్రమం ఇది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నా గవర్నమెంట్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరికీ సమయానికి జీతాలు ఇస్తున్నామని, ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామని సీఎం చెప్పారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. అన్న క్యాంటిన్లు మూసేశారని.. ఇప్పుడు తాము తిరిగి ప్రారంభించామన్నారు. పేదలకు దీపం కార్యక్రమం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామని.. ఆ హామీని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా 93 లక్షల మందికి దీపం 2 అందుతోందన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి డీఎస్సీ సెలక్షన్ పూర్తి చేసి బడులు తెరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక మత్స్యకారులకు సైతం అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు రూ. 20 వేలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం వారికి హాలిడే ఇస్తామని.. ఆ హాలిడే కంటే ముందుగానే ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామన్నారు
అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, ప్రస్తుతం గత ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కలిసి పోటీ చేయలేదు.. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. గత పాలనలో ఏపీ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
మరోవైపు.. గౌరవ సభను గౌరవించలేని సంస్కారం లేని పార్టీ వైసీపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోంది.. 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఏపీని గాడిలో పెడుతున్నాం.. గత ప్రభుత్వం అసెంబ్లీని కౌరవ సభగా మార్చింది.. ప్రజామోదంతో మళ్లీ సభలో అడుగుపెట్టామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి తోడ్పాడు అందుతోందని వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తున్నాం.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని సీఎం తెలిపారు.
మరోవైపు.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం.. అన్న క్యాంటీన్లు మళ్లీ తెరిచి పేదల కడుపు నింపుతున్నామని అన్నారు. అంతేకాకుండా.. 16 వేల 384 పోస్టులతో త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని పేర్కొ్న్నారు. అదే విధంగా ఉద్యోగాల కల్పనపై కూడా దృష్టి పెడతామని సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాష్ట్రం మారుతుందని.. దీంతో ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నెలకు మూడు వేల ఉద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
కాగా.. సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి ప్రభుత్వ ప్రాధాన్యత వివరించారు. అనంతరం.. అసెంబ్లీ సమావేశాలు శుక్ర వారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.