Yadagirigutta |యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ గోపురాన్ని భక్తులకు అంకితం చేసిన రేవంత్ రెడ్డి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు 11.54కి మూలా నక్షత్రం, వృషభ లగ్నం, పుష్కర అంశంలో లక్ష్మీనరసింహ స్వామివారికి స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు ఆలయంలో నేటి నుంచి మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన స్వర్ణ గోపురాన్ని రేవంత్ ప్రారంభించారు.

ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వామనామలై పీఠాధిపతి సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణమయ పంచతల విమాన గోపురం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు..

మామూలు గోపురం కాదు:

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు. దీనికి పూర్తిగా బంగారంతో తాపడం చేశారు. ఇందుకు 68 కేజీల బంగారాన్ని వాడారు. ఇందుకు రూ.3.90 కోట్లు ఖర్చు అయ్యింది. అలాగే.. గోల్డ్ ప్లేట్ తయారీ, ఏర్పాటు కోసం మరో రూ.8 కోట్లు అయిపోయాయి. చెన్నైకి చెందిన మెసర్స్‌ స్మార్ట్‌ క్రియేషన్స్‌ కంపెనీ ఈ పని చేసింది.

యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ.. బంగారు విమాన గోపురాన్ని అప్పటికి ఏర్పాటు చెయ్యలేదు. 2021 నాటికి గోపురానికి తాపడం చెయ్యడానికి 125 కేజీల బంగారం అవసరం అని అప్పటి ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ అంచనాలు దాదాపు డబుల్ ఉన్నట్లైంది. ఇప్పుడు 68 కేజీలతోనే తాపడం పూర్తైంది. ఏది ఏమైనా ఈ బంగారు గోపురం అయ్యే వరకూ.. భక్తుల్లో కొంత అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు స్వర్ణ గోపురం కారణంగా.. యాదగిరి గుట్టను చూస్తే.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని చూసినట్లే ఉంది అంటున్నారు.

గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులను చకచకా పూర్తి చెయ్యడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జోరుగానే ఉంటోంది. మార్చి 1 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరి గుట్టలో జరుగుతాయి. ఆలోపే ఈ స్వర్ణ గోపురం పనులు పూర్తవ్వడం మంచి పరిణామం. అందువల్ల ఇకపై ఈ ఆలయానికి వెళ్లేవారికి.. సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి కలగడం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *