Chittoor | కాకరకాయ.. కాసుల వర్షం..

Chittoor | కాకరకాయ.. కాసుల వర్షం..
- మూడు ఎకరాల్లోనే రూ.5 లక్షల లాభం..
- రామకుప్పం ఆదర్శ రైతు నరేంద్ర..
Chittoor, చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసి, సాధారణంతో పోలిస్తే.. అధిక దిగుబడి పొందవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. విద్యుత్, ఎరువుల వినియోగం తగ్గడంతో రైతులకు భారం తగ్గడమే కాక, పంటల నాణ్యత పెరుగుతోంది. ఉద్యాన, వ్యవసాయ, చెఱకు, మల్బరీ, పశుగ్రాస పంటలకు, నీటి అందుబాటు ఉన్న అందరు రైతులకు మైక్రో ఇరిగేషన్ శాతం వారీగా రాయితీ అమలు అవుతోంది. ఐదు ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్న యస్.సి., యస్.టి. రైతులకు 100 శాతం రాయితీతో, ఇతరులకు 90 శాతం రాయితీతో రూ.2.18 లక్షల వరకు సహాయం అందిస్తున్నారు. ఐదు నుంచి పది ఎకరాల వారికి రూ.3.46 లక్షలు, పది ఎకరాల పైబడిన వారికి 50 శాతం రాయితీతో రూ.4 లక్షల వరకు సాయం అందిస్తూ 12.50 ఎకరాల వరకు బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. స్ప్రింక్లర్ పద్ధతికి కూడా 50 శాతం రాయితీ లభిస్తోంది.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కంచనబల్ల గ్రామానికి చెందిన టి. నరేంద్ర మాట్లాడుతూ.. తాను పూర్వీకుల నుంచి వ్యవసాయాధారిత జీవనాన్ని కొనసాగిస్తున్నానని, మూడు ఎకరాల భూమిలో రసాయన వ్యవసాయం చేస్తుండగా ఖర్చులు పెరగడం, భూసారం తగ్గడం, దిగుబడి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సేంద్రియ పద్దతుల పై గుంటూరులో అందించిన శిక్షణ తనకు మార్గదర్శకమైందన్నారు. ఆరోగ్యం, నేల సారం, దిగుబడులు మెరుగవుతాయని తెలుసుకున్న తర్వాత కాకర సాగును పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

ఉద్యాన శాఖ ద్వారా రెండు ఎకరాలకు పందిరి ఏర్పాటు కోసం రెండు లక్షల రూపాయలు సబ్సిడీగా అందించడంతో పాటు, మూడు ఎకరాల సాగు కోసం మొత్తంగా 6 వేల మొక్కలను రాయితీతో ఇచ్చారని తెలిపారు. కాకర పంట దాదాపు 32 టన్నులు పండడంతో, పంట అమ్మకానికి ఇబ్బందులు రాకుండా బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పంద పద్ధతిలో కిలో ధర రూ.32గా నిర్ణయించి మొత్తం పంటను కొనుగోలు చేయించారని చెప్పారు. పెట్టుబడి ఖర్చులు తీసివేసినా దాదాపు రూ.5 లక్షల లాభం వచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సు కోసం అందిస్తున్న పథకాలు, రుణాలు, సబ్సిడీలు వ్యవసాయాన్ని మళ్ళీ లాభదాయకంగా మార్చాయని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

