మెప్మా అక్రమాలపై నిగ్గు తేల్చాలి…

- మాజీ మంత్రి బాలినేని డిమాండ్
ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో: ఒంగోలు మెప్మాలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
పేద మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెప్మాను ఏర్పాటు చేశాయన్నారు. అయితే కొందరు అధికారులు, సిబ్బంది రాజకీయ నాయకుల అండతో అక్రమాలకు పాల్పడటం దుర్భరమని బాలినేని విమర్శించారు.
ఏ పార్టీకి చెందిన వారైనా అవినీతి, అక్రమాల్లో పాల్గొంటే వారి పేర్లు బయట పెట్టాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా మెప్మాలో అవకతవకలు జరుగుతున్నాయనీ, అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు.
