IND vs PAK | నేడు మహా సంగ్రామం… అందరి కళ్లు ఈ మ్యాచ్ పైనే !

  • దాయాదుల పోరుకు తీవ్ర ఉత్కంఠ‌
  • సెమీస్‌పై బెర్త్ పై భారత్‌ క‌న్ను..
  • పాక్ కు డూ ఆర్ డై

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు తలపడనున్నారు. గ్రూప్-ఎలో ఉన్న‌ భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో దాయాదుల పోరుకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే నేటి మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే దాదాపు సెమీస్ చేరడం ఖాయం. మరోవైపు ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు డూ ఆర్ డై గా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే దాయాది జ‌ట్టు బ్యాగులు సర్దుకుని ఇంటికి బ‌యల్దేరాల్సిందే ! ఒకవేళ పాక్ చేతిలో భారత్ ఓడిపోతే.. మార్చ్ 2న‌ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.

మార్పుల్లేకుండా..

.గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్‌ తన ఫామ్‌ను చాటి చెప్పగా, రోహిత్‌ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్‌ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్‌ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు.రాహుల్‌ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్‌ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్‌ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్‌ను ముగించింది. అక్షర్‌ బ్యాటింగ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్‌లో షమీ అద్భుత పునరాగమనం భారత్‌ బలాన్ని ఒక్కసారిగా పెంచింది.బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్‌ రాణా ఆకట్టుకున్నాడు.

జట్టులో మార్పు చేయాల్సి వస్తే కుల్దీప్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి రావచ్చు.ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్ / వరుణ్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్‌ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు.

నెట్ ర‌న్ రేట్ కీల‌కం !

త‌మ‌ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన టీమిండియా… 0.408 నెట్ ర‌న్‌తో గ్రూపు-ఏ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానాన్ని ద‌క్కించుకుంది. భార‌త్ ఖాతాలో ప్ర‌స్తుతం రెండు పాయింట్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ పై విజ‌యం సాధించిన న్యూజిలాండ్ ఖాతాలోనూ రెండు పాయింట్లే ఉన్నాయి.

అయితే భార‌త నెట్ ర‌న్‌రేటు కంటే కివీస్ నెట్ ర‌న్‌రేటు (+1.200) అధికంగా ఉండ‌టంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఇక బంగ్లాదేశ్ మూడో స్థానంలో, పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. గ్రూప్ ద‌శ‌లో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే భారత్ కు నెట్ ర‌న్‌రేట్ కీలకంగా మారే అవ‌వాశముంది.

2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయం

2023 వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాల బృందం పాకిస్థాన్‌ను కుదిపేసింది. విజిటింగ్ టీమ్ కేవలం 191 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్‌ జోడీ కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా నాలుగు వికెట్లు తీశారు

సొంత గ‌డ్డపై పాక్ కు తిప్ప‌లు..

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జ‌ట్టు గ్రూప్ ద‌శ‌ల్లో త‌మ చివ‌రి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఈనెల 27న ఆడాల్సి ఉంది. భార‌త్‌, బంగ్లాదేశ్ పై విజ‌యం సాధించినా సెమీస్‌కు చేరే అవ‌కాశాలు పాక్‌కు త‌క్కువ‌గానే ఉన్నాయి. సెమీస్ కు చేరుకోవాలంటే మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.

ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ తో పోలిస్తే బంగ్లాదేశ్ నెట్ ర‌న్ రేటు కాస్త మెరుగ్గానే ఉంది. అయితే, ఆ జట్టు తదుపరి న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. అయితే.. ఇది కాస్త కష్టమైన పనే.

కీల‌క మ్యాచ్ లో పాక్ కు ఎదురుదెబ్బ !

ఇలాంటి కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆయన నిష్క్రమణ జట్టుకు కష్టమేనని చెప్పొచ్చు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఫఖర్ సెంచరీతో చెల‌రేగాడు. కాగా, ఫఖర్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ కు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఓకే చెప్పింది.

ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారడంతో… నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది !

ప్రత్యక్ష ప్రసార వివరాలు

ఈరోజు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజ్ మ్యాచ్ కోట్లాది మంది ఈ మ్యాచ్ చూడనున్నారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *