Amaravati | కాస్మోస్ ప్లానిటోరియం..

Amaravati | కాస్మోస్ ప్లానిటోరియం..
Amaravati, మంగళగిరి ఆంధ్రప్రభ : “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్” అమరావతిలో ప్లానిటోరియం ఏర్పాటు చేయనుంది. ప్రజారాజధాని అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” ఏర్పాటుకై ఏపీ సిఆర్డిఏ అధికారులతో “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్” ఎంఓయూ చేసుకోనుంది. ఈ నెల 28న అమరావతిలో పలు ముఖ్య బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనున్న సందర్భంగా ఈ ఎంఓయూ జరగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఇతర ప్రముఖ ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” ఏర్పాటుకై ముందడుగు పడనుంది.
అమరావతిలో ప్రముఖ విద్యా, వైద్య సంస్థలు ఇప్పటికే కొలువుదీరగా త్వరలో మరిన్ని విద్యా, వైద్య సంస్థలు రానున్నాయి. క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు సైతం మొదలు కానున్నాయి. పర్యాటక, మౌలికవసతుల కల్పన ప్రాజెక్టులు సైతం పురోగతిలోకి రానున్నాయి. విద్యా, వైద్య, పర్యాటక రంగాలలో అమరావతి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అమరావతిలో ప్లానిటోరియం ఏర్పాటైతే విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు వంటి విషయాలను విద్యార్థులు స్పష్టంగా, దృశ్య రూపంలో అర్థం చేసుకునే అవకాశం లభించడంతో పాటు సైన్స్, టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్ వంటి రంగాల మీద విద్యార్థుల్లో ఆసక్తి, జిజ్ఞాస పెరుగుతుంది.
3D/డోమ్ ప్రొజెక్షన్ ద్వారా ఆకాశపు రహస్యాలను చూసే అవకాశం ఈ ప్లానిటోరియం ద్వారా లభించడంతో పాఠ్యపుస్తకాల్లోని విషయాలు మరింతగా అర్ధం కావడంతో పాటు గ్రహాల కదలికలు, అనంత విశ్వంలోని విషయాల పై అధ్యయనం చేయాలనే అభిరుచి విద్యార్థులలో పెరుగుతుంది. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ సంబంధిత పరిశోధన రంగాల్లో కెరీర్ అభివృద్ధి చేసుకోవడానికి సైతం విద్యార్థులకు ప్రేరణ లభిస్తుంది.
