Natural resources|రాయలసీమను ఎడారి కాకుండా కాపాడండి..

  • రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు

Natural resources| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతం రతనాల సీమ అని, అనేక సహజ వనరులు నీటి వనరులు ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవటానికి ఈ ప్రాంతానికి చెందిన పాలకులే కారణమని సాగునీటి సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోజ్జ దశరథ రామ్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంయుక్త కిసాన్ మోర్చ కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ఎన్నాళ్ళీ అన్యాయాల్ని సహించాలి అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు కలిసి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 40 శాతం, జనాభాలో 30 శాతం భాగాన్ని కలిగి ఉన్నాయన్నారు. రాయలసీమకు ప్రకృతి అపారంగా వనరులను అందించిందన్నారు.

అటవీ సంపద, ఖనిజ సంపద, అన్ని రకాల పంటలు పండే సారవంతమైన భూములు, అనుకూలమైన వాతావరణం ఈ ప్రాంతంలో నెలకుని ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు సరిపడే విత్తన ఉత్పత్తి చేయగల మానవ వనరులు అయిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. కృష్ణా–తుంగభద్ర–పెన్నా నదుల ప్రవాహాలు ఈ ప్రాంతానికి జీవనాడిగా ఉన్నాయని ఎల్లప్పుడూ నీరు నిండుకుండలా ఉంటుందన్నారు. రాయలసీమ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాల మధ్యలో ఉండటం, అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు కలిగి ఉండటం వలన పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం పెట్టుబడులతో అభివృద్ధి చెందేందుకు అపూర్వ అవకాశాలు ఉన్నాయని సభకు వివరించారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలోను వెనుకకు నెట్టిబడిందని అందుకు గత కొన్ని ఏళ్లుగా పాలకులే కారణమని విమర్శించారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులారా మేల్కొని ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చర్చించి శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాగునీటి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply