Hyd |లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడ్ని కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు
హైదరాబాద్ – లిఫ్టుకు – స్లాబ్‌కు మధ్య ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు శుక్రవారం కాపాడాయి. మాసబ్ ట్యాంకు, శాంతినగర్‌లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో లిఫ్ట్ డోర్ కు గోడకు మధ్య 6 సంవత్సరాల అర్నవ్ ఇరుక్కున్నాడు అని హైడ్రాకు ఫిర్యాదు రాగానే డీఆర్ ఎఫ్ రంగంలోకి దిగింది.
మధ్యాహ్నం 2.29 గంటలకు ఘటన జరిగినట్టు సమాచారం అందుకోగానే డీఆర్ ఎఫ్ మొదటి బృందం 10నిమిషాల్లో చేరుకుంది. తర్వాత మరో రెండు బృందాలు తోడయ్యాయి. గ్రిల్‌తో ఉన్న లిఫ్ట్ డోర్ తెరిచిన వెంటనే బయటకు వచ్చే క్రమంలో అంతస్తు స్లాబ్‌కు – లిఫ్ట్‌కు మధ్య ఉన్న గ్యాప్(ఖాళీగా ఉన్న సందులో)లో పడిపోయి కిందకు జారి మొదటి అంతస్తు దగ్గర ఇరుక్కున్నట్టు నివాసితులు చెప్పారు.
నాలుగు అంతస్తుల అపార్టుమెంట్‌లో మూడో అంతస్తులో పిల్లలతో ఆడుకుని లిఫ్టు ఎక్కి జారిపడినట్టు నివాసితులు తెలిపారు. లిఫ్ట్ ఎవరూ ఆపరేట్‌చేయకుండా ముందుగా కరెంటు కనెక్షన్ తొలగించారు. ఆ వెంటనే డీఆర్ ఎఫ్ బృందాలు ఆపరేషన్ మొదలు పెట్టాయి.
గ్యాస్‌కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పనిముట్లుతో లిఫ్టు ఫ్రేమ్‌ను కట్ చేయడంతో పాటు.. స్లాబ్‌ను కూడా అతి కష్టమ్మీద కట్ చేసి బాలుడుని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. సరిగ్గా 4.35 గంటల ప్రాంతంలో బయటకు తీసి.. తల్లిదండ్రులకు అప్పగించి.. తర్వాత ఆసుపత్రికి తరలించారు.
జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎ. యజ్ఞ్ననారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. దత్తు ఆధ్వర్యంలో డీఆర్ ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. లిఫ్టు ఫ్రేమ్‌లు కట్ట చేసి క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసి…. పిల్లాడిని సురక్షితంగా బయటకు తీయడాన్నిచూసిన స్థానికులు హైడ్రా బృందాలను అభినందించారు.