Nepal Protests లో మళ్లీ ప్రకంపనలు…
ఆంధ్రప్రభ : నేపాల్‌లో వీధుల్లోకి మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారా జిల్లాలో అధికారులు అత్యవసరంగా కర్ఫ్యూ విధించారు. సెప్టెంబర్‌లో సోషల్ మీడియా బ్యాన్, పౌర హక్కుల పరిమితులు వంటి నిర్ణయాలపై జెన్ Z యువత భారీ ఆందోళనలు (Nepal Protests) చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆ నిరసనల కారణంగా అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. అయితే ఈరోజు మళ్లీ సిపిఎన్–యుఎంఎల్ (Communist Party of Nepal – Unified Marxist Leninist) కార్యకర్తలు ఓలీకి అనుకూలంగా భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.

దీన్ని అడ్డుకునేందుకు జెన్ Z నిరసనకారులు రోడ్లపైకి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బారా జిల్లా సిమారా ప్రాంతంలో రెండు వర్గాల మద్దతుదారుల ర్యాలీలతో ఉద్రిక్తత చెలరేగడంతో, ప్రజలు గుంపులుగా చేరడం నిషేధిస్తూ పోలీసులు అక్కడ రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
Nepal Protests | ప్రశాంతంగా ఉండండి..
శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని నేపాల్ పోలీసుల ప్రతినిధి అబి నారాయణ్ కఫ్లే తెలిపారు. నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీలా కర్కి ప్రజలను ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయంగా రెచ్చగొట్టే చర్యలను నివారించాలని సూచించిన ఆమె, మార్చి 5న జరగనున్న ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం ఉంచాలని కోరారు. 110కు పైగా పార్టీల నేతలతో నిన్న సమావేశం నిర్వహించిన కర్కి, ఈ దేశ భవిష్యత్ కొత్తతరం చేతుల్లోనే ఉంది. దార్శనికత ఉన్న నేతలు దేశాన్ని నడపాలి అని పేర్కొన్నారు.

