COLLECTOR | వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ

COLLECTOR | వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ
COLLECTOR | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వికలాంగుల సంక్షేమార్థం వినికిడి యంత్రాల (Hearing Aids) పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్, నేషనల్ హెల్త్ మిషన్–ఆర్‌బీఎస్‌కే, ఎన్‌పిపిసిడీ, ఎన్‌సిడీ ఆధ్వర్యంలో వికలాంగులకు వినికిడి యంత్రాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రేపటి నుండి ఈ నెల 26 వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతి వికలాంగుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత పరికరాలు పొందాలని సూచించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు వంటి పరికరాలను విస్తృతంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో ఎవరికి కూడా తగ్గని సామర్థ్యం కలిగినవారని, ప్రభుత్వ పథకాల (Government Schemes) ద్వారా వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పరికరాలు అందించే బాధ్యత తనదేనని, అవసరమైన వారు తమ వివరాలను తెలియజేయాలని సూచించారు.

పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులలో 95 శాతం వరకు చెవుడు సమస్య ఉన్న వారికి కృత్రిమ వినికిడి యంత్రాలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు (State And Central Governments) కలిసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని వికలాంగుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపేలా ఈ శిబిరాలు కొనసాగుతాయని అన్నారు. 2018లో ప్రారంభమైన దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ ఇప్పటివరకు 20 వేలమందికి వినికిడి పరికరాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఒక వినికిడి యంత్రం మార్కెట్ విలువ సుమారు 20 నుంచి 25 వేల రూపాయలు ఉంటాయని, ఈ పరికరాలను బామ్లర్ లారీలో అండ్ కంపెనీ లిమిటెడ్ సిఎస్‌ఆర్ కార్యకలాపాల ద్వారా అందించడం ప్రశంసనీయమని అన్నారు.
అనంతరం పిల్లలకు వినికిడి పరికరాలను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే చెన్నకేశవులు నాయుడు (MLA Chennakeshavulu Naidu) డి.డి.ఎస్.ఎఫ్ చైర్మన్ రేగుల రామాంజులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సి.ఆర్. రాజన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.ఎం. లక్ష్మీనారాయణ, డీఎండ్హెచ్ఓ డా. డి.టి. సుధారాణి, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ రెడ్డి, తపాన్ సర్కార్, ఏ. భువనచందర్, శ్రీ రామన్, అరుణ్, నవనీత కృష్ణన్, అబ్దాస్ సత్తార్, అధికారులు, వికలాంగులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
