SRISHAILAM | శైవ క్షేత్రాలు కిటకిట

- ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- కార్తీకమాస ఉత్సవం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు
- శ్రీశైలం, మహానంది, యాగంటి క్షేత్రాలలో అన్నదాన శిబిరాలు
SRISHAILAM | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కార్తీక మహోత్సవం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం మహానంది యాగంటి ఓంకారం సంజామల మండలంలోని నయనాలప్ప వంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని పాఠశాలలకు కళాశాలలకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. శ్రీశైలం, మహానంది ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు క్యూలో నిలబడటం విశేషం. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శిస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని దైవ దర్శనం చేరుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైలం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాల సేవలను జరిపించిన అనంతరం వేకువజామన 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలను కొనసాగించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం 5.30గంటల నుంచి దర్శనాలు కొనసాగుతాయన్నారు. ఈ రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలుపుదల చేయడం జరిగినదన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయన్నారు. దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారన్నారు. కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు ఉదయం నుంచే భక్తులకు వేడిపాలను కూడా అందజేయడం జరిగిందన్నారు. భక్తులకు అల్పాహారంగా పులిహోర, పెరుగన్నం, కట్టుపొంగలి, తాగునీరు, బిస్కెట్లు అందజేయబడుతున్నాయన్నారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయన్నారు. అలాగే సాయంత్రం 6.39 గంటల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుందన్నారు. కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయబడ్డాయన్నారు. మొత్తం 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేయబడుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో తెలిపారు. జిల్లాలోని సంజామల మండలంలో వెలసిన మైనాలప్ప పుణ్యక్షేత్రములు కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా కాశిరెడ్డి నాయన నిత్య అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవాలయాలు వస్తా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు.
