TG | హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీలకం – కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నింటిలో డీఆర్‌ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పని చేయాల్సినవసరం ఉందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం డీఆర్‌ఎఫ్‌లోకి ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న 357 మంది శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంబర్‌పేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. సమాజంలోనూ.. ప్రభుత్వ పరంగా హైడ్రా ప్రధాన మైన భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు…
ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్‌ఎఫ్ పాత్ర చాలా కీలకమైందని, ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయని కమిషనర్ రంగనాథ్ అన్నారు. తమ మీద ఉన్న నమ్మకంతోనే ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పని కూడా మనకే బాధ్యత అప్పగించిందని అన్నారు. పోలీసు పరీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా.. సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేశామన్నారు. ఇది ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు. భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉంటూ.. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించే విధానాలపై శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు.