kuppam | ఒంటరి ఏనుగు దాడిలో.. రైతు

kuppam | ఒంటరి ఏనుగు దాడిలో.. రైతు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మరోసారి ఏనుగు దాడి (elephant attack) తో దుఃఖంలో మునిగింది. కుప్పం మండలం కూర్మాయిపల్లి సమీపంలోని మల్లకుంట వద్ద వేకువజామున జరిగిన ఘటనలో రైతు ప్రాణాలు కోల్పోయాడు. అడవి పందుల భయం కారణంగా తన పంటకు కాపలా కాస్తున్న రైతు కిట్టప్ప (70) పై ఒంటరి ఏనుగు దాడి చేసింది. పొలం మధ్యలో ఉన్న గుడిసెలో నిద్రిస్తున్న కిట్టప్పను ఏనుగు బయటకు లాగి తొక్కి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు.

వేకువజామున ఏనుగు గర్జనలు విన్న పొరుగువారు బయటకు పరుగెత్తి వచ్చినప్పుడు, అప్పటికే కిట్టప్ప (Kittappa) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. రైతు రాగి, మొక్కజొన్న, అరటిపంటలు సాగు చేస్తుండగా పంటను అడవి పందుల నుండి రక్షించుకోవాలనే ఉద్దేశంతో రాత్రివేళ పొలం వద్దే ఉండేవాడు. అయితే, అనూహ్యంగా అడవి నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు అతనిపై దాడి చేసి మృత్యువాతకు గురి చేసింది.

సమాచారం అందుకున్న అటవీ అధికారులు (Forest officials), పోలీసు బృందం ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఏనుగు పాదముద్రలను ఆధారంగా తీసుకుని దాని కదలికలను గుర్తించేందుకు ట్రాకింగ్ ప్రారంభించారు. వనాధికారులు మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఏనుగు గత నెల రోజులుగా కుప్పం సరిహద్దులోని తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా కాలి కోయిల్ ప్రాంతంలో కూడా సంచరిస్తూ భయపెడుతోందని, అప్పుడు కూడా అదే ఏనుగు ఒక వృద్ధ మహిళపై దాడి చేసి, ఆమె చేతిని రెండు ముక్కలు చేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు చెప్పారు. అక్కడి నుంచి తిరిగి కుప్పం అటవీ సరిహద్దులోకి వచ్చినట్లు సమాచారం.

స్థానిక ప్రజలు ఇటీవలి వారాలుగా ఏనుగుల సంచారం పెరిగిపోయిందని, రాత్రివేళ రోడ్లపై తిరగడానికీ భయపడుతున్నామని వాపోతున్నారు. రైతులు తమ పంటల వద్ద కాపలా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఏనుగుల (elephants) సంచారం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. ప్రతి ఏడాది ప్రాణ, పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. కుప్పం పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తక్షణమే ఏనుగుల నియంత్రణ బందోబస్తు ఏర్పాటు చేసి, విద్యుత్ కంచెలు, హెచ్చరిక సైరన్లు ఏర్పాటు చేయాలి అని ఏనుగుల బాధితులు డిమాండ్ చేశారు.

మృతుడి కుటుంబ సభ్యులు కిట్టప్పను ఎంతో కష్టపడి పంటను సాగు చేస్తుండగా ఈ దుస్థితి ఎదురవడం తట్టుకోలేక విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుప్పం మండలం కూర్మాయిపల్లి ప్రాంతంలో ఏనుగుల సమస్య మళ్లీ తలెత్తడంతో గ్రామస్థులు రాత్రిపూట వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Leave a Reply