Cotton Farmers | సమస్యల సుడిలో పత్తి రైతుల అగచాట్లు..

  • నిలువ చేసేందుకు గూడు లేక.. ఆరబెట్టేందుకు స్థలం లేక
  • తేమ శాతం కొర్రీలతో ప్రైవేటు వైపే మొగ్గు
  • స్లాట్‌ బుకింగ్‌ జాప్యంతో ఇంటివద్దే కాలిబూడిదైన పత్తి నిలువలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ బ్యూరో(ఆంధ్రప్రభ) : పత్తి (Cotton ) కొనుగోళ్లలో పరిమితులు.. స్లాట్‌ బుకింగ్‌లో సమస్యలు.. తేమ శాతం కొర్రీలు వెరసి మార్కెట్‌లో పత్తి రైతు దగా పడాల్సి వస్తుంది. అన్నదాతకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పోరేషన్‌ తేమ శాతం నిబంధనల కొర్రీల పేరుతోనే ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటామని తేల్చి చెపుతుండటంతో పంట పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో తెల్లబంగారం సాగుపై గంపెడు ఆశలు పెట్టుకుని 10.62 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండించిన ఉమ్మడి జిల్లా రైతులు మార్కెట్‌లో ఇటు అధికారులు మరోవైపు దళారుల చేతుల్లో విలవిలలాడుతున్నారు. గత ఏడాది రైతు పండించిన ఎకరా పొలంలో 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే మార్కెట్‌లో విక్రయించే వెసులుబాటు ఉండేది.

ఈసారి దిగుబడి తగ్గిందన్న సాకు చూపి కేవలం సగటున ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేయడంతో మిగిలిన పత్తి నిలువలను ప్రైవేటు వ్యాపారులకే తక్కువ ధరకు విక్రయించి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఆదిలాబాద్‌ మార్కెట్‌ లో సీసీఐ అధికారులు క్వింటాలు మద్దతు ధర రూ. 8110 చొప్పున కొంటామని చెపుతూనే 8 నుండి 12 శాతం లోపు తేమ ఉన్నవాటిని మాత్రమే కొనుగోళ్లుచేస్తూ… మిగితా పత్తి బండ్లను నాణ్యత లేదనే సాకుతో తిప్పి పంపుతున్నారు.

సహజ సిద్దంగానే ఈసారి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సాధారణంగా తేమ శాతం 15 నుండి 20 శాతం వస్తుంది. మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తిని మార్కెట్ యార్డుల్లోనే ఆరబెడుతూ తేమ శాతం తగ్గేవరకు రైతులు తమ పంట నిలువల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది.

Cotton

స్లాట్‌ బుకింగ్‌ నిబంధనతో Cotton విక్రయాల్లో జాప్యం…

సీసీఐ అందుబాటులోకి తీసుకువచ్చిన కపాస్‌ కిసాన్ యాప్‌లో రైతులు ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేయకపోతే పంటను విక్రయించుకునే అవకాశం లేదు. పట్టా పాసుపుస్తకంతో పాటు సర్వే నెంబర్‌ మండలం, గ్రామం , అధికారుల నుంచి పంట ద్రువీకరణ పత్రంతోపాటు పత్తిని ఎప్పుడు విక్రయించదలుచుకున్నారో తేదీ, పంట బరువు, సమయం… ఏ మార్కెట్‌ యార్డులో అమ్ముతారో అన్న విషయాలను స్లాట్‌ బుకింగ్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.

యాప్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా, పత్తి పంటను CCI కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తారు. మార్కెటింగ్‌ శాఖాధికారులు, వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా ఇవేమి పట్టించుకోకపోవడంతో రైతులకు పంట వి క్రయాల్లో జాప్యం ఏర్పడుతుంది , ఇక మారుమూల గ్రామాలు , ఏజెన్సీ ప్రాంతాల రైతులు స్మార్ట్‌ ఫోన్‌లు లేక , నెట్‌వర్క్‌ సరిగా అందక అక్షరాస్యత లేక అవస్థలు పడుతున్నారు.

జైనథ్‌ మండలం లక్ష్మీపూర్‌లో రెండురోజుల క్రితం హైదవ్‌ దీపక్‌ అనే రైతు 50 క్వింటాళ్ల పత్తిని ఇంట్లో నిలువ చేసి ఉండగా షాట్‌సర్క్యూట్‌ కారణంతో కాలిబూడిదై అంతులేని దుఖాన్ని మిగిల్చింది. రూ. 30 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధి త రైతు సురేష్‌ కంటతడిపెట్టారు.

స్లాట్‌ బుకింగ్‌ జాప్యం కారణంగానే పత్తిని అమ్ముకోలేదని, పండించిన కష్టం అగ్నికి ఆహుతి అయిందని ఆవేదన వ్యక్తంచేసారు. మరోవైపు బుధవారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పొచ్చర గ్రామంలో కౌలు రైతు ఎగిరె సురేష్‌ ఏడు ఎకరాల్లో పండించిన పత్తి పంట బుధవారం అగ్నిప్రమాదంలో కాలిబూడిదైంది.

కిసాన్‌ కపాస్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌లో అనేక నిబంధనల కారణంగానే కౌలుకు తీసుకున్నవివరాలను నమోదు చేయడం, భూమి యజ మాని పట్టాదారు సంతకం తప్పనిసరి కావడంతో విక్రయించేందుకు ఆలస్యమైందని, ఈలోగా పత్తి నిలువలు కాలిబూడిదయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సర్కారు విధించిన ఆంక్షలు , నిబంధనలు పత్తి రైతుల మెడకు ఉచ్చులా బిగుస్తున్నాయి. వైపరిత్యాలను పరిగణలోకి తీసుకుని ఆంక్షలను సడలిస్తేనే రైతులకు మార్కెట్‌లో మేలు జరిగే అవకాశం ఉంది.

రవాణా శాఖలో ఎన్ఫోర్స్‌మెంట్‌ కఠినతరం

Leave a Reply