Governor | సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
అమ్మాయిలు ఎక్కువ పతకాలు సాధించడం గర్వకారణం: గవర్నర్ అబ్దుల్ నజీర్
రాయలసీమ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ .
విద్యారంగ ప్రగతిపై ప్రశంసలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ (S.Abdul Nazeer) రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాలికలు ఎక్కువ బంగారు పతకాలు సాధించడం సంతోషకరమైన అంశం, గర్వకారణమని పేర్కొన్నారు. విద్యారంగంలో మహిళల ముందడుగు సమాజ అభివృద్ధికి సంకేతమన్నారు.
విద్య ఉపాధి సాధనమే కాక, సేవకు పునాది..
గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్య కేవలం ఉపాధి సాధనమేకాక, సమాజ సేవకు పునాదిగా ఉండాలన్నారు. చదువుతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని ఆయన అభినందించారు. అనంతరం యూనివర్సిటీలో 75 మందికి పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేశారు.

ఈ స్నాతకోత్సవం (graduation ceremony) లో గవర్నర్ స్వయంగా 75 మంది పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల త్యాగం, అధ్యాపకుల మార్గదర్శకత వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. వచ్చే కాన్వొకేషన్ నాటికి బాలురు మరిన్ని పతకాలు సాధించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి వచ్చి స్వయంగా బంగారు పతకాలు అందజేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

విశ్వవిద్యాలయ ప్రగతిపై ప్రశంసలు..
రాయలసీమ విశ్వవిద్యాలయం (Rayalaseema University) విద్యా, పరిశోధనా రంగాల్లో విశిష్ట స్థానం సంపాదించిందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. సమకాలీన సాంకేతిక విద్యను అందిస్తూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్న విశ్వవిద్యాలయ వాతావరణం ప్రశంసనీయమన్నారు.

వైస్ చాన్సలర్ బసవరావు చేతుల మీదుగా సత్కారం…
కార్యక్రమం అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను రాయలసీమ యూనివర్సిటీ (Rayalaseema University) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బసవరావు మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవం విద్యా ప్రాధాన్యాన్ని, మహిళా సాధికారతను ప్రతిబింబించిన వేడుకగా నిలిచింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం విద్యార్థులకు నూతన ప్రేరణను అందించడం విశేషం.
మాంటిస్సోరి పాఠశాల స్వర్ణోత్సవంలో..
రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ (Governor) అనంతరం మాంటిస్సోరి పాఠశాల స్వర్ణోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాంటిస్సోరి పాఠశాల స్థాపకురాలు కళ్యాణమ్మకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమానికి ముందుగా గవర్నర్ నజీర్ మాంటిస్సోరి స్కూల్ వ్యవస్థాపకురాలు దివంగత కళ్యాణమ్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించారు.
అనంతరం ఆమె చేసిన విద్యారంగ సేవలపై ప్రశంసలు కురిపించారు. నగరంలోని ఏ. క్యాంప్‌లో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్లో స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అనంతరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.


