మీరు రెండేళ్లే..

మీరు రెండేళ్లే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని.. ఈ దుగ్ధతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (KTR) ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఊహించని ఫలితాన్ని బీఆర్ఎస్ కు ఇస్తున్నారని, ఇది రూఢీ అయిపోయిందని, సర్వేలన్నీ ఇవే చెబుతున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి 2028లో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సివుందని, అయితే 2027లోనే ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ కుర్చీని లాగేసేందుకు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మంత్రుడు, ఎమ్మెల్యేలు ఢిల్లీ కేంద్రంగా కత్తులు నూరుతున్నారని ఒక్కో ఓటుకు ఆరు వేలు ఇచ్చి కొనుగోలు చేస్తోందని.. ఇప్పటి వరకు ఓట్ల కొనుగోలుకు 250 కోట్లు రూపాయలు ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది గులాబీ జెండానే అని, తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత 16 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించబోతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నది కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమని ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను ఓడించేందుకు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లు కొనుగోలుకు పంపించిన డబ్బుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కమీషన్ల పేరుతో దండుకుంటున్నారని, ఓటుకు ఆరు వేలు ఇస్తుంటే.. అందులో రెండు వేల రూపాయలను జేబులో వేసుకుని మిగతా మొత్తాన్ని ఓటర్లకు ఇస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ వార్ రూమ్ లో ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్ వ్యూలో ఈ సంచలన ఆరోపణలు చేశారు.

Leave a Reply