ప్రశంసిస్తూ జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీ
వరద ముంపు దారి మళ్లింపు
బాపట్ల ప్రతినిధి నవంబర్, ఆంధ్రప్రభ: రాజకీయ నాయకులకు, అభిమాన చిత్ర కథానాయకులకు, కుటుంబ వేడుకలకు పండుగలకు సంతాప దినాలకు ఫ్లెక్సీలు కడుతున్న ఈ రోజుల్లో ఒక జిల్లా అధికారి కలెక్టర్‌కు బాపట్లలో ఫ్లెక్సీ కట్టటం ఇదే ప్రథమం. బాపట్ల జిల్లా నాలుగవ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల సమయంలోనే తనదైన రీతిలో పేద ప్రజలకు చెరువుగా సంక్షేమాన్ని అందజేస్తూ జిల్లా ప్రజలు మా కలెక్టర్ దేవుడు అనేలా సంబోధిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం యువకుడు ఏకంగా కలెక్టర్ కు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఇది అతిశయోక్తి కాదు యదార్థం కలెక్టర్ పాలన ఇలాగే ఉండాలి అంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ పాలనా తీరుతో అభివృద్ధిలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం గా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు ఫోరం ఫర్ బెటర్ సభ్యులు పలువురు అభిప్రాయపడుతున్నారు. మొంథా తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా రైతులను అప్రమత్తం చేస్తూ పంట నష్టం కొంతమేర తగ్గించారని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంత ప్రజలను తీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులను పునరావసక్ కేంద్రాలకు తరలించి వారి సొంత ఇంటి వాతావరణాన్ని కల్పించారు కలెక్టర్. సమయానికి అల్పాహారం, భోజనం, ఔషధ మందులు, వృద్ధులకు గర్భిణులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసి సురక్షితంగా తుఫాను ప్రభావం అనంతరం బస్సులు ఏర్పాటు చేసి వారి స్వగ్రామాలకు తరలించారు. అధిక వర్షాల కారణంగా జిల్లాలో వరద ముంపుతో పంట పొలాలు మునిగిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కారంచేడు వద్ద ఏకంగా రహదారినే గండి కొట్టి సూపర్ బ్రెయిన్ కలెక్టర్గా పేరొందారు. ప్రజలనే కాకుండా మూగ జీవులను సైతం వరద ముంపు నుండి కాపాడిన ఘనత కలెక్టర్ వినోద్ కుమార్ కే దక్కుతుంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ప్రజల అర్జీలను విస్మరించకుండా పరిష్కారం చూపుతున్న కలెక్టర్గా పేరొందరు. ఒక యువకుడు గతంలో గ్రీవెన్స్ లో అర్జీ నమోదు చేసిన సమస్యకు పరిష్కారం పొందకపోవడంతో నూతనంగా వచ్చిన కలెక్టర్ వినోద్ కుమార్ కు మరొకసారి అర్జీ ఇవ్వటం జరిగింది. ఇది షరా మామూలే గా నా సమస్యను ఎవరు పరిష్కరించరనుకుంటూ సమయం వృథా అవుతుంది అన్న భావనతో ఉన్న అర్జీదారుడకు రాత్రి 11 గంటల సమయంలో కలెక్టర్ ఫోన్ చేసి నీ సమస్యకు ఈ విధమైన పరిష్కారం చూపాను అంటూ చెప్పడంతో బాధితుడు ఆనందానికి అవధులు లేవు. ఏకంగా కలెక్టర్ వినోద్ కుమార్ ను ప్రశంసిస్తూ తన గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైనం పలువురు అభినందిస్తున్నారు.

