విద్యార్థునులకు ముప్పు
- ప్రమాదకరంగా బాలికల గురుకుల పాఠశాల
- స్లాబ్ పెచ్చులు ఊడి తాజాగా ఇద్దరికి గాయాలు
- ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆగ్రహం
గుడివాడ, ఆంధ్ర ప్రభ : కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలోని మోటూరు గ్రామం(Motor village)లో ఉన్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా బుధవారం సాయంత్రం పాఠశాల స్లాబ్ పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. బాధిత విద్యార్థినులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనం పాడైపోయి ఉన్నా, అదే గదిలో విద్యార్థినులను కూర్చోబెట్టడం ప్రిన్సిపాల్(Principal) నిర్లక్ష్యం కారణమని వారు ఆరోపించారు. భవనం పరిస్థితిపై అధికారులు ఇప్పటికే సమాచారం అందుకున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల భద్రత(safety of girl students) కోసం తక్షణమే భవనాన్ని మరమ్మతు చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

