పేరు నమోదైన డీలర్ వద్దనే తీసుకోవాలని నిబంధన
హుజూర్నగర్, ఆంధ్రప్రభ : రేషన్ షాపులో బియ్యం తెచ్చుకోవాలంటే సాధారణంగా వెంట బ్యాగు తీసుకెళ్తారు. కానీ ఇప్పడు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana state government) రేషన్‌కార్డు దారులకు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
అయితే రేషన్ సంచుల పంపిణీ గందరగోళంగా మారింది. వినియోగదారులు వారి పేరు నమోదైన డీలర్ వద్దనే సంచి తీసుకోవాలి అనే నిబంధనతో వినియోగదారులందరికీ సంచులు అందడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వినియోగదారులు తమకు వెసులుబాటు ఉన్న ఎక్కడైనా రేషన్(Ration) తీసుకోవచ్చు అన్న నిబంధన ఉన్న రేషన్ కోసం వెళ్లిన వారికి సంచులు ఇచ్చే విషయంలో గందరగోళ పరిస్తితి నెలకొన్నది.
రాష్ట్ర పరిధిలోని అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల (గోదాము) లకు ఇప్పటికే ఈ పర్యావరణహిత బ్యాగులు చేరుకున్నాయి. వీటిని ఆయా ఎంఎల్ఎస్ పాయింట్ల(MLS points) పరిధిలోని రేషన్ డీలర్లకు రేషన్ కార్డుల సంఖ్య ప్రకారం అధికారులు సరఫరా చేస్తారు. ఈ బ్యాగులపై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను ప్రస్తావిస్తూ ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదాన్ని ముద్రించి ఉంటుంది.
వినియోగదారులు ఈ సంచులను ప్రతి నెల రేషన్ బియ్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది. ప్రస్తుతం బ్యాగులు స్టాక్ పాయింట్ల నుండి రేషన్ డీలర్ల(ration dealers) వద్దకు వచ్చి ఉన్నాయి. నెల కోటాకు సంబంధించి బియ్యంతో పాటు బ్యాగులను రేషన్ దుకాణాల్లోనే అందజేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. రేషన్ షాపులకు ఎన్ని కార్డులు ఉంటే అన్ని బ్యాగులు (సంచులు) పంపిణీ చేసారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారుడు ఎక్కడనైనా రేషన్ తీసుకోవచ్చనే వెసులుబాటు ఉన్నా రేషన్ బ్యాగ్ కోసం తప్పని సరిగా వినియోగదారుడు తన పేరు నమోదైన రేషన్ సెంటర్‌కు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిన పరిస్తితి నెలకొన్నది. ఒకవేళ తనకు అందుబాటులో ఉన్న రేషన్ షాపు(ration shops) వద్ద బియ్యం తీసుకుంటే బ్యాగ్ వాడుకోవాల్సిన పరిస్తితి నెలకొన్నది.
ఈ విషయంలో సంబంధిత అధికారులు వినియోగదారులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్న వినియోగదారులందరికీ రేషన్ బియ్యంతో పాటు బ్యాగ్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

