జూబ్లీహిల్స్ (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల కరస్పాండెంట్స్ అసోసియేషన్ (GHPRSCA) ప్రతినిధులు తెలిపారు.
మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జూబ్లీ కన్వెన్షన్ హాల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో 350కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తమ మద్దతు ప్రకటించారు.
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ సెంట్రల్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ విశ్వనాధ్ మాట్లాడుతూ.. అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్న సమస్యలను సవివరంగా విన్నానని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అసోసియేషన్ ప్రతినిధులు ట్రేడ్ లైసెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ మినహాయింపు, విద్యుత్-నీటి బిల్లులను కమర్షియల్ నుంచి డొమెస్టిక్ కనెక్షన్ల కింద మార్చడం, ETR గడువును 10 నుంచి 20 సంవత్సరాలకు పెంచడం, 2009 తర్వాత స్థాపించబడిన పాఠశాలలకు ఫైర్ NOC మినహాయింపు, సబ్సిడీ రుణాలు, సబ్సిడీ రేట్లలో పాఠ్యపుస్తకాల సరఫరా వంటి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
కార్యక్రమంలో GHPRSCA అధ్యక్షుడు జితేందర్ కుమార్, కార్యదర్శి ప్రణయ్ కుమార్ యాదవ్, వసీం ఉన్నిస్సా, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.



