ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తా..

  • బాదితుడికి భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి హామీ
  • కూల్చిన పిల్లర్లు,బేస్ మెంట్ పరిశీలించిన ఆర్ డి ఓ
  • ఆర్డీఓ కు సమస్యలు విన్నవించిన కాశవారి గూడెం వాసులు

మోత్కూర్, (ఆంధ్రప్రభ) : ఓ నిరుపేద గూడు కూలిస్తే.. ఆ గూడెం కదిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కాశవారి గూడెంలో ప్రభుత్వ స్థలంలో పక్కా భవనం నిర్మిస్తున్నారని రెవెన్యూ, మున్సిపల్ ,పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఫక్కీర్ అహమద్ కి చెందిన ఇంటి పిల్లర్లు,బేస్ మెంట్ ని సోమవారం కూల్చివేశారు.

మంగళవారం భువనగిరి ఆర్డిఓ ఎం.కృష్ణారెడ్డి మున్సిపల్ కార్యాలయంకి వచ్చి బాధితుని పేరు మీద ఇల్లు ఉందా, ఏమైనా పన్నులు కడుతున్నారా, అది ప్రభుత్వ స్థలమేనా, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు ఉందా అని మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంకి చేరుకోగా అప్పటికే కాశవారి గూడెం ప్రజలు, మహిళలు సుమారు 100 మంది నిరాశ్రయులైన బాధితుడు ఫక్కీర్ అహ్మద్ పక్షాన అక్కడే ఉన్నారు. ఆర్డిఓకి బాధితుడు స్వయంగా వినతిపత్రం అందజేశారు.

గత 30 ఏండ్లుగా అదే స్థలంలో తాము గుడిసె వేసుకుంటున్నామని,ఇందిరమ్మ ఇల్లు కూడా లేదని ఆర్డీవోకి విన్నవించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరు అవుతాయని, ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేయవద్దన్నారు.

బాదితునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం ఎమ్మెల్యే సామెల్ తమను కోరారని, తొలి దశలో ఇంటి స్థలం ఉన్న వాళ్లకు కేటాయించామని, 2 వ దశలో స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రతిపాదనలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి బాధితునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని ఆర్డిఓ స్వయంగా హామీ ఇచ్చారు. అనంతరం కాశవారి గూడెంను క్షేత్రస్థాయిలో ఆర్డిఓ బాధితుని కూల్చిన ఇంటి నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు.

కాలనిలో ఇండ్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని, మినీ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని మరమ్మతులు చేయించాలని, ప్రాధమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, సమీప ప్రభుత్వ స్థలం స్మశాన వాటిక కోసం తమకు కేటాయించాలని కాలని వాసులు కోరగా ఆర్డీవో సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన వెంట తహశీల్దార్ జ్యోతి, ఆర్ ఐ సుమన్,రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి లు ఉన్నారు.

Leave a Reply