సామాజిక తెలంగాణ సాధ‌న‌యే ల‌క్ష్యం

సామాజిక తెలంగాణ సాధ‌న‌యే ల‌క్ష్యం

ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సామాజిక తెలంగాణ సాధనయే త‌మ ల‌క్ష్య‌మ‌ని, త‌మ అజెండా అని జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత (Kalvakuntla Kavitha) అన్నారు. ఈ రోజు ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. త‌మ అజెండా న‌చ్చిన వారికి, న‌చ్చ‌ని వారికి కూడా స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌న్నారు. జాగృతిని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ప‌రిష్కారానికి ప‌నిచేస్తామ‌ని చెప్పారు. నాలుగు నెల‌ల‌పాటు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఎక్కడికి వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయ‌ని, వాటిలో నాలుగు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించినా త‌మ జ‌న్మ ధ‌న్య‌మ‌వుతుంద‌న్నారు. ఫిబ్రవరి 13 వరకు జనం బాట పూర్తవుతుంద‌న్నారు. పటాన్ చెరు, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్ వచ్చేలా కేంద్రంతో మాట్లాడాల‌ని ఎంపీల‌కు క‌విత సూచించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడకు పరిశ్రమలు వ‌స్తాయ‌ని, చెప్పుకోద‌గ్గ ప‌రిశ్ర‌మ‌లు ఇక్క‌డ లేవ‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, ప‌రిశ్ర‌మ‌లు తెచ్చేందుకు కృషి చేయాల‌న్నారు. తరుణం బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరముంద‌న్నారు. ఆ బ్రిడ్జి వద్ద ఒక పిల్లవాడు కొట్టుకుపోయాడ‌ని, ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపు కోవటం కాద‌న్నారు. ఖానాఫూర్ చెరువులో కనీసం గుర్రం డెక్క ను కూడా తీయటం లేద‌న్నారు.

ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో చాలా సమస్యలు త‌మ‌ దృష్టికి వచ్చాయ‌ని, వాటి పరిష్కారానికి త‌మ‌ వంతు ప్రయత్నం చేస్తామ‌ని క‌విత అన్నారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఆదిలాబాద్ నాలుగో జిల్లా అని, 33 జిల్లాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వ‌హిస్తామ‌న్నారు. తెలంగాణలో అన్ని సమస్యలకు రాష్ట్ర ఏర్పాటు పరిష్కామ‌ని, రాష్ట్రం వచ్చాక కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నామ‌ని, కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకున్నామ‌ని, ఇంకా ప‌రిష్కారం కానీ స‌మ‌స్య‌లు కూడా చాలా ఉన్నాయ‌ని చెప్పారు. తాను 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాన‌ని, ఫీల్డ్ లో ఎంత పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తే అంత క్లారిటీ వస్తుంద‌న్నారు.

ప‌త్తి సీజ‌న్ ఉంద‌ని, అదేవిధంగా మొంథా తుఫాను ఎఫెక్ట్ (mantha cyclone effect) ఉంద‌ని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ముందే తెలుసున‌ని, ఎంపీ, ఎమ్మెల్యే తోపాటు ఏ నాయ‌కుడు కూడా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌ని క‌విత అన్నారు. పత్తి తేమ శాతం పెంచి తీసుకోవాలని నేను కలెక్టర్ ను కోరిన‌ట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మీద ఉన్న శ్రద్ద ప్రభుత్వానికి పత్తి రైతుల మీద లేదని మండిప‌డ్డారు. జూబ్లీహిల్స్ లో రైతులు లేరు కనుక వారిని పట్టించుకోవటం లేద‌న్నారు. ఏదైనా రూరల్ ప్రాంతంలో ఉప ఎన్నిక వచ్చి ఉంటే రైతులు గుర్తుకు వ‌స్తార‌న్నారు. పత్తి, సోయ, వరి, మక్కా ఏ రైతుకు కూడా మంచి జరగటం లేద‌ని విమ‌ర్శించారు. బోనస్ ఇవ్వటం లేదని, రైతు భరోసా ఇస్తామన్నంత ఇవ్వలేద‌ని, యూరియ లేద‌ని, పైగా కరెంట్ కోతలు అని అన్నారు. ఆర‌బెట్టిన త‌ర్వాతే తేమ శాతం చూడాల‌ని, ఈ విషయంపై కలెక్టర్ తో మాట్లాడితే సమస్య పరిష్కారానికి అంగీకరించార‌న్నారు. ప్ర‌తిప‌క్షం మాదిరిగా వాయిస్ తాము వినిస్తామ‌న్నారు. సీసీఐ చైర్మ‌న్‌తో కూడా తాను మాట్లాడాతానని చెప్పారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో త‌న‌కు పరిచయం ఉంద‌న్నారు.

బీఆర్ఎస్ చెప్పాలి?..

ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా- కొరటా, కుప్తి ప్రాజెక్ట్ లు కావాల్సి ఉన్నాయ‌ని, రూ.మూడు వందల కోట్ల అంచనాలు కాస్త రెండు వేల కోట్లు అయ్యాయ‌ని, ప్రాజెక్టు వ్య‌యం ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాల‌న్నారు? మ‌హారాష్ట్ర‌లో 1500 ఎక‌రాల భూసేక‌ర‌ణ ఇంకా జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్రాజెక్ట్ నీళ్లు ఓవర్ ఫ్లో అయితే ఇబ్బంది లేకుండా మహారాష్ట్ర వైపు బండ్ కట్టారని చెప్పారు. కానీ మన వైపు బండ్ కట్టలేదని, మన ప్రజా ప్రతినిధులకు ఇంత చిన్న విషయంపై కూడా శ్రద్ధ లేదని అన్నారు. మ‌రో ప‌ది శాతం ప‌నులు పూర్తి చేస్తే, 50 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌స్తాయ‌ని తెలిపారు.

ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న కొమురం భీమ్ కాలనీలో వెయ్యి మంది వివిధ ఆదివాసీ తెగల నివాసానికి సంబంధించి సమస్య ఉంద‌ని, ఈ భూమిలో ప్రైవేట్ వాళ్ల భూములు ఉన్నాయ‌ని, ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడితే సమస్య తీరుతుంద‌ని క‌విత అన్నారు. ఇక్కడ ఆదివాసీల కోసం ఏమీ చేయటం లేద‌న్నారు. కానీ మావాలలో 181 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్ద వాళ్ల కోసం రిజిస్ట్రేషన్ చేశార‌న్నారు. మరి పేదవాళ్లైనా ఆదివాసీల కోసం ప్రభుత్వం ఎందుకు పెద్ద మనసు చేసుకోవటం లేదు? అని ప్ర‌శ్నించారు. బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసుకునేందుకు జాగృతి శ్రేణులు పోరాటం చేస్తాయ‌ని చెప్పారు. సిరిచెలిమ వద్ద కూడా ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉంద‌ని, బోథ్ లో అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామ‌ని అన్నారు.

Leave a Reply