జూబ్లీహిల్స్ లో చెన్నూర్ కార్యకర్తల ప్రచారం
చెన్నూర్ ఆంధ్రప్రభ :ఈ నెల 11న జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి ఆయా పార్టీల ఆది నాయకుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలివెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక ఉపాధిశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ క్యాడర్‌ను హైదరాబాద్ రప్పించుకోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ నియోజకవర్గంలోని అనుచరవర్గాన్ని రంగంలోకి దింపి గడపగడపకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎక్కడో రాష్ట్ర రాజధానిలో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి స్థానిక కార్యకర్తల ప్రచారాలు స్థానిక సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

