గిన్నిస్ బుక్ లో.. పుంగనూరు ఆవులు..

గిన్నిస్ బుక్ లో.. పుంగనూరు ఆవులు..

చిత్తూరు బ్యూరో, (ఆంధ్రప్రభ)
రాష్ట్రానికి గర్వకారణమైన పుంగనూరు ఆవులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని పుష్కర్ పశుప్రదర్శనలో ఈ ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సందర్శకుల మన్ననలు పొందాయి. చిన్న శరీరాకృతిలో అద్భుత సామర్థ్యం, తక్కువ మేతతో ఎక్కువ పాలు ఇచ్చే లక్షణం, అధిక పోషక విలువ కలిగిన పాలు ఇవన్నీ పుంగనూరు ఆవులను విశేష జాతిగా నిలబెట్టాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఆవులంటే విశేషమైన అభిమానం ఉందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతానికి చెందిన పుంగనూరు జాతి ఆవుల పట్ల ఆయనకున్న అభిమానం ప్రత్యేకం. ఈ జాతి ఆవులను ప్రధాని తన అధికారిక నివాసంలో స్వయంగా పెంచుతూ సంరక్షిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తక్కువ బరువు ఎత్తు కలిగి తక్కువ మేత తింటూ ఎక్కువ పాలు దిగుబడి ఇస్తున్న ఈ ఆవులు గిన్నిస్ రికార్డులో సైతం ఎక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆవులను పెంచుకోవడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ప్రజల డిమాండుకు సరిపడినన్ని పుంగనూరు జాతి ఆవులు లభించడం లేదు. ఈ ఆవులు క్రమంగా అంతరించి పోతున్నాయి. పుంగనూరులో ఈ జాతి ఆవుల ప్రత్యేక పరిశోధన ఉత్పత్తి కేంద్రం ఉన్న ప్రజల అవసరాలను తీర్చలేక పోతున్నాయి.

ప్రధాని నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఉన్న గోశాలలో పుంగనూరు ఆవులు ఉండగా, ఇటీవల వాటిలో ఒక ఆవు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు. ఆ బచ్చిడికి దీపజ్యోతి అని పేరు పెట్టినట్టు సమాచారం. ఈ సందర్భంలో ప్రధాని స్వయంగా ఆ ఆవులను చూసి, మేత తినిపించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. పుంగనూరు ఆవులు చిన్న కాయ పరిమాణం, తక్కువ పాలు ఇచ్చినా అధిక పౌష్టికత కలిగి ఉండడం వంటి విశిష్ట లక్షణాల వల్ల ప్రసిద్ధి చెందాయి. సగటు ఎత్తు 70 నుండి 90 సెంటీమీటర్ల మధ్య ఉండే ఈ జాతి, దేశంలోని అతి చిన్న ఆవులుగా గుర్తింపు పొందాయి. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతం ఈ జాతికి మూలస్థానం కావడంతో, ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ ఈ జాతిని ప్రోత్సహించడం వల్ల దేశ వ్యాప్తంగా పుంగనూరు ఆవుల సంరక్షణ పై కొత్త చైతన్యం ఏర్పడిందని పశువైద్య విభాగం అధికారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ జాతి అభివృద్ధికి ప్రత్యేక బ్రీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పుంగనూరు ఆవుల పాలలో ఉన్న పోషక విలువలు, తక్కువ ఆహారంతో ఎక్కువ ఉత్పత్తి లక్షణాలు వీటిని దేశ వ్యాప్తంగా రైతుల దృష్టిని ఆకర్షించాయి. పుంగనూరు జాతి ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ గుర్తించడం, దేశీయ పశుసంపద పరిరక్షణకు ఒక మైలురాయిగా భావించబడుతోంది.

పుష్కర్ పశుప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ..
ప్రతి సంవత్సరం రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మేర్ జిల్లా పుష్కర్ పట్టణంలో ఈ పశు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. కార్తీక మాసంలో జరిగే ఈ ప్రదర్శన దేశంలోనే అతి పెద్ద పశుల బజార్‌గా పేరుపొందింది. వేలాది ఒంటెలు, గుర్రాలు, ఆవులు, దున్నపోతులు, పశు జాతులు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. వాణిజ్య కార్యక్రమాలకే కాకుండా, సాంస్కృతిక ప్రదర్శనలు, జంతు అలంకరణ పోటీలు, గోపూజలు, పర్యాటక ఆకర్షణలు కూడా ఈ ఉత్సవంలో భాగంగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఈ ప్రదర్శనను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈసారి ఈ ఉత్సవంలో పాల్గొన్న పుంగనూరు ఆవులు తమ అందం, వినమ్ర స్వభావం, అధిక పాల ఉత్పత్తితో దేశంలోని పశు సంరక్షకులను ఆకట్టుకున్నాయి. పొడవు కేవలం 3 అడుగుల వరకు మాత్రమే ఉంటాయి. బరువు 100 నుండి 150 కిలోల వరకు ఉండి, రోజుకు 3 నుండి 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు శాతం 5 నుండి 8 శాతం వరకు ఉంటుంది. వీటికి తక్కువ నీరు, తక్కువ మేత సరిపోతుంది. వేడి వాతావరణం కూడా తట్టుకుంటాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్..
పుంగనూరు ఆవుల ప్రత్యేకతలను గమనించిన దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, గోశాల నిర్వాహకులు వీటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పుంగనూరు ఆవుల ధర రూ.80,000 నుంచి రూ.1.5 లక్షల వరకు పలుకుతున్నాయి. జాతి పరంగా శుద్ధమైన, పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ఆవులు రూ.2 లక్షలకు పైనా అమ్ముడవుతున్నాయి. పుణే, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ మాత్రమే కాదు, దుబాయ్, అమెరికా వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ ఆవుల పై ఆసక్తి చూపుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని పశుసంవర్ధక పరిశోధనా కేంద్రం పుంగనూరు ఆవుల జాతి పరిరక్షణ, విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. కృత్రిమ గర్భాధారణ విధానాల ద్వారా ఈ జాతిని పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా రైతులను ఈ జాతి పెంపకం పై ప్రోత్సహిస్తున్నారు. పుంగనూరు ఆవులు కేవలం పాలు ఉత్పత్తి జాతిగా మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఆలయాలలో గోపూజలలో వీటిని వినియోగిస్తున్నారు. కొందరు వీటిని దేవి రూపంగా పూజించే సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న పుంగనూరు ఆవులు..
భారతదేశపు అతి చిన్న జాతి ఆవుగా పుంగనూరు ఆవులు గిన్నిస్ రికార్డులు ఎక్కాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. పుష్కర్ పశు ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ఈ జాతికి మరింత గుర్తింపు లభించింది. భవిష్యత్తులో పుంగనూరు ఆవులను పెంపక వ్యాపారంగా తీసుకుంటే రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన పుంగనూరు ఆవులు ఇప్పుడు దేశాన్ని ఆకట్టుకుంటున్నాయి. పాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి, తక్కువ ఖర్చుతో నిర్వహణ, సాంస్కృతిక విలువలు కలిపి ఈ జాతిని అత్యంత విలువైనదిగా నిలబెట్టాయి. ప్రభుత్వం, రైతులు, జంతు ప్రేమికులు కలిసి పని చేస్తే పుంగనూరు ఆవులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంపాదించడం ఖాయం.

Leave a Reply