భారీ వాహ‌నాల‌ భీభత్సం..

భారీ వాహ‌నాల‌ భీభత్సం..

య‌ముని మ‌హిష‌పు లోహగంట‌లు..
టిప్పర్ కాదు… కాలయముడు!
కంట్రోల్ లేని రోడ్డు రాక్షసులు..

టిప్పర్…లారీ…సరుకు రవాణాకు ఉపయోగపడే ప్రధానమైన వాహనాలు…కానీ, ఇవి ఇప్పుడు మనుషులను భయభ్రాంతులకు గురిచేస్తూ…పరలోక ప్రయాణం చేయించే యమదూతల్లాగా తయారయ్యాయి…హోరెత్తించే వీటి హారన్లు…యముని మహిషపు లోహ గంటల్లాగా వినిపిస్తూ దడపుట్టిస్తున్నాయి.

రహదారులపై భారీ టిప్పర్లు, లారీలు కనిపిస్తే చాలు, గుండె దడ మొదలవుతోంది. భారీ ఇంజిన్ శబ్దం, రోడ్డును మొత్తం ఆక్రమించే తీరుతో ఈ వాహనాలు కాలయముడిలా చెలరేగిపోతున్నాయి.
ఈ ఓవర్‌లోడ్ వెహి‘కిల్స్’ వల్ల ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో..ఎక్కణ్ణుంచి ఏం వార్తవినవలసివస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది..

మనం బస్సు, కారు, బైకు ఎలా ప్రయాణిస్తున్నప్పుడు, ఈ భారీ వెహికిల్స్ వెనుక నుంచి వస్తున్నా, మన ముందుగా దూసుకెళ్తున్నా, లేదా మన పక్కనుండి ఓవర్‌ టేక్ చేస్తున్నా గుండె దడ తప్పదు. ఒక్కసారి పక్క నుంచి దూసుకెళ్తే ఆ గాలి తాకిడితో బైక్‌లు.. కారు అద్దాలు వణుకుతాయి. ఎక్కువ శాతం టిప్పర్లు పెద్దపెద్ద బండరాళ్లు, కంకర మోసుకెళ్తుంటాయి. ఆ కంకర ఎప్పుడు జారిపడి మన మీద పడుతుందో అనే భయంతో చిన్న వాహనదారులు ఎప్పుడూ అల్లాడిపోవలసిందే. టిప్పర్ దాటిపోయిన తర్వాతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి.

ఈ టిప్ప‌ర్, లారీల‌ బీభత్సం ఎంతటి భయంకరంగా ఉంటుందో ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా, చేవెళ్ల-తాండూర్ రోడ్డుపై టిప్పర్-బ‌స్సు ఢీకొని 20 మంది మృతి చెందగా.. రాజస్థాన్‌లో టిప్ప‌ర్ కారణంగా 19 మంది మృతి చెందారు. నిబంధనలకు మించిన బరువుతో నడిచే ఈ వాహనాలు ట్రాఫిక్ భంగం కలిగించడమే కాకుండా, ఘోర ప్రమాదాలకు మూల కారణాలు అవుతున్నాయి.

ట్ర‌క్కుల్లో ఓవ‌ర్ లోడ్ కార‌ణంగా బ్రేకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో వాహనం అదుపు తప్పి, బస్సులు, కార్లు లేదా ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్తుంటాయి. ఫలితంగా, డ్రైవర్ చేసిన ఒక చిన్న పొరపాటు… రోడ్డుపై ప్రయాణించే పదుల సంఖ్యల అమాయక ప్రజల చావుకు కారణమవుతోంది.

డ్రైవర్ల నిర్లక్ష్యం…

ఈ ప్రమాదాలకు డ్రైవర్ల అలసట, శిక్షణ లేమి, ఒత్తిడి, ప్రధాన కారణాలుగా తేలుతున్నాయి.. ట్రక్ డ్రైవర్లు తరచూ 10–12 గంటలకు పైగా కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తుంటారు. దానివల్ల వారికి ఏర్పడే నిద్రలేమి, ఒత్తిడితో పాటు, అలసటను అధిగమించడానికి మద్యం లేదా తంబాకు సేవించి డ్రైవింగ్ చేయడం డ్రైవింగ్ మరింత ప్రమాదకారణాలుగా నిలుస్తున్నాయి. లోడ్ డెలివరీ సమయానికి చేరుకోవాలన్న ఒత్తిడితో డ్రైవర్లు వేగం పెంచుతారు, అప్పుడు ఆ భారీ వాహనాల ఫలితంగా చిన్న పొరపాటు కూడా పెద్ద విషాదంగా మారుతుంది.

ఓవర్‌లోడ్ వాహనాలు కేవలం మనుషులకే కాదు, రోడ్డు మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒక లారీ సాధారణంగా 15 టన్నుల వరకు మాత్రమే మోయగల సామర్థ్యం కలిగి ఉంటే, అనేక రోడ్లపై 25 టన్నులకుపైగా లోడ్లు మోస్తున్న వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ అదనపు బరువు కారణంగా రోడ్లపై పగుళ్లు, గుంతలు ఏర్పడి, వాటి మరమ్మత్తులకు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి.

ప్రతి రహదారి తమ ప్రియమైన వారి తిరిగి రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఆశల వంతెన. కానీ ఈ ఆశలు, ఒక నిర్లక్ష్య డ్రైవర్, ఒక అనుమతికి మించిన ఓవర్‌ లోడ్ లారీ లేదా పని చేయని బ్రేకుల కారణంగా ఒక్క క్షణంలో ఛిద్రమైపోతున్నాయి. చట్టాలు ఉన్నా, వాటి అమలులో లోపం ఉన్నప్పుడు… రోడ్లపై నడిచే వాహనాలు…ప్రాణాలు తీసే యమపాశాలు…

Leave a Reply