కాంగ్రెస్ ఆకు రౌడీలకు ఓటర్లు భయపడవద్దు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగి పోయారని, తిరిగి బీఆర్‌ఎస్ పాలననే కోరుతున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షల ప్రకారం మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌పై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యతిరేకత ఉధృతమవుతోందని చెప్పారు. కాంగ్రెస్ ఆకు రౌడీల బెదిరింపులకు భయపడకుండా నిలదీయాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కేటీఆర్ కోరారు. రాబోయే బీఆర్‌ఎస్ పాలనలో ఆ రౌడీ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ఎంఐఎం కార్యకర్తలు, స్థానిక నాయకులు, చిరు వ్యాపారులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే చిన్నా, పెద్దా వ్యాపారులందరిపై రౌడీ వసూళ్లు ప్రారంభమవుతాయని హెచ్చరించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ రౌడీలు విచ్చలవిడిగా సంచరిస్తూ ఓటర్లను బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చకుండానే కొత్త డ్రామాలతో ప్రజలను మోసం చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సమయంలో ప్రజలు తెలివిగా ఆలోచించి బీఆర్‌ఎస్‌ను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ డబ్బులు పంచుతుందనే ఆరోపణ చేస్తూ, “ఆ డబ్బులు తీసుకుని మిగతా బాకీలు ఎప్పుడు ఇస్తారో అడగండి” అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
“ఈ ఎన్నికలు కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్నాయి. పేదల ఇళ్లు కూల్చిన ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పండి,” అని కేటీఆర్ ప్రజలను పిలుపునిచ్చారు. ధైర్యంగా పని చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలను ప్రోత్సహించారు.

