- ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్…
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనం (సామాజిక న్యాయ మహా శిల్పం) విజయవాడ నగర పర్యాటకానికి మణిహారమని.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని, ఈ క్రమంలో పర్యాటకులకు మరింత మధురానుభూతులు మిగిల్చేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఎన్టీఆర్ కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ.. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బీలావణ్య వేణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్. మల్లి కార్జునరావుతో కలసి విజయవాడ నగరపాలక సంస్థ, ఏపీఐఐసీ, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ సమన్వయ శాఖల అధికారుల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం స్మృతివనాన్ని సందర్శిస్తున్న పర్యాటకులు, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వనరుల సమర్థ వినియోగం తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనం నగర పర్యాటక ప్రాంతాల జాబితాలో ముందు వరుసలో ఉండాలని, నగరాన్ని సందర్శించే ప్రతిఒక్కరూ స్మృతి వనాన్ని సందర్శించేలా, మహనీయుని ఆశయాల స్ఫూర్తిని, విజ్ఞాన వీచికలను భావితరాలకు అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
గుజరాత్ నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ స్టాట్యూ ఆఫ్ యునిటీ, వివిధ రాష్ట్రాల్లోని మహనీయుల స్మారక ప్రాంతాల తరహాలో డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనం మరింత అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాల్లో సమన్వయ శాఖల అధికారులు ఒక బృందంగా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఇందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియగించడం ముఖ్యమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉందన్నారు.
పర్యాటకులకు ఇప్పుడు అందుతున్న సౌకర్యాలతో పాటు వారి సౌకర్యార్థ్యం చేపట్టే ఫుడ్ కోర్టు, చిన్నారుల ఆట స్థలం, ఆడిటోరియం, ఎక్స్పీరియన్స్ సెంటర్, మ్యూజియం తదితరాలకు సంబంధించిన అభివృద్ధి పనులను పటిష్ట ప్రణాళికతో త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను చేపట్టి, నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. వైబ్రెంట్ విజయవాడతో పాటు జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని.. ఇందులో భాగంగా డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని భాగస్వామ్య పక్షాల సూచనలు మేరకు మరింత అభివృద్ధి చేసేందుకు, నిర్వహణ పరంగా లోటుపాట్లు లేకుండా చూసేందుకు చొరవ చూపుతున్నట్లు వివరించారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డా. డి.చంద్రశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, డిప్యూటీ జోనల్ మేనేజర్ అబ్దుల్ రహీం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, కేపీసీ ప్రాజెక్ట్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

