భారీగా మద్యం, వాహ‌నాలు సీజ్

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : ఫిర్యాదుల మేరకు మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజి కాలనీలో పోలీసులు శుక్రవారం సాయంత్రం భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ ఆకస్మిక ఆపరేషన్‌లో మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీల్లో పోలీసులు 13 బ్లాక్‌లలోని 415 ఫ్లాట్లను పరిశీలించారు.

తనిఖీల్లో 54 లీటర్ల అక్రమ మద్యం (అంచనా విలువ రూ.50,000), పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 ద్విచక్ర వాహనాలు, రెండు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

డీసీపీ పద్మజా రెడ్డి మాట్లాడుతూ, “ఎల్ఐజి కాలనీలో తనిఖీలు చేయాలని కోరుతూ వచ్చిన 102 ఫిర్యాదుల మేరకే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించాం,” అన్నారు. పాత కేసుల్లో నిందితులుగా ఉన్న కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని సూచించారు. వాహన పత్రాలు లేని వారు రెండు మూడు రోజులలోపు పోలీస్ స్టేషన్‌కి వచ్చి పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని తెలిపారు.

అలాగే ఎస్ఎంఎస్‌లలో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దు, ఓటీపీలను ఎవరికీ షేర్ చేయవద్దు, ఉచిత డబ్బుల ఆశతో యాప్‌లు డౌన్‌లోడ్ చేసి బెట్టింగ్‌లకు పాల్పడవద్దు, అని సూచించారు.

ఈ కార్డన్ సెర్చ్ సందర్భంగా సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు ఎల్ఐజి కాలనీ వాసులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి, పోచారం సీఐ రాజు వర్మ, ఘట్‌కేసర్ సీఐ బాలస్వామి, డీఐ శ్రీనివాస్, ఎస్సై నాగేశ్వర్, ఎస్సై శివకృష్ణ, పోలీస్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply