ఆంధ్రప్రభ, విజయవాడ క్రైమ్ : జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శుక్రవారం విజయవాడ నగరంలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సమైక్యతా రన్ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, దేశ ఐక్యతా వాది భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, ఏఆర్ఏడీసీపీ కె.కోటేశ్వరరావు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయవాడ వ్యాస్ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు, తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు సమైక్యతా రన్ నిర్వహించారు.
ఈ రన్‌ను డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్.వి.డి. ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జాతీయ జెండాలు, సమైక్యతా సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతకు అంకితమవుతానని ప్రతిజ్ఞ చేశారు.
ఏఆర్ఏడీసీపీ కె.కోటేశ్వరరావు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలు, సూచనలు అడిగి తెలుసుకుని, సంక్షేమ చర్యలకు కట్టుబడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్.వి.డి. ప్రసాద్, ఏఆర్ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, పాల్గొన్నారు.

