పటేల్ కృషి చిరస్మరణీయం
మక్తల్, (ఆంధ్రప్రభ) : పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో పోలీసులు ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశానికి మొదటి హోంమంత్రిగా పని చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా సిఐ రామ్ లాల్ కొనియాడారు. సర్దార్ పటేల్ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించిన మహనీయుడు అని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ విధుల్లో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతకు పటేల్ చేసిన కృషి వలన ఆయనకు ఉక్కు మనిషి అనే బిరుదు లభించిందని అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం తరువాత ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అప్పట్లో రాజుల పాలనలో ఉన్న సుమారు 562 స్వతంత్ర రాజ్యాలను భారత్‌లో విలీనం చేసి దేశ ఏకీకరణకు విశేష కృషి చేశారని అన్నారు. భిన్న జాతులు, భాషలు, భౌగోళిక పరిస్థితులు ఉన్నా దేశాన్ని సమైక్యంగా ఉంచిన పటేల్ కృషి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ప్రజలందరితో సిఐ రామ్ లాల్ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి, కృష్ణా ఎస్ఐ నవీద్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

