సీఎం ఆర్డర్స్…

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టం, రోడ్ల దెబ్బతినడం, సహాయక చర్యలపై అధికారులు వివరాలు అందించారు.
తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రాణనష్టం జరగకుండా, పశువులు ప్రమాదంలో పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తుఫాను, వర్షాల ప్రభావమున్న జిల్లాల్లో చేపడుతున్న సహాయక చర్యలు, రోడ్లు, రహదారుల పునరుద్ధరణ చర్యలు ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రులు సమీక్షించాలని సీఎం కోరారు. తమ సొంత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, ఇన్ఛార్జీగా ఉన్న జిల్లాల్లో ప్రజలను ఆదుకునే చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
