అక్కడ తీవ్ర పంట నష్టం..

అక్కడ తీవ్ర పంట నష్టం..

ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మం జిల్లాలో పాలేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. సుమారు 37, 500 క్యూసెక్కుల(37, 500 cusecs) నీరు ఎగువన పడుతున్న వర్షాలతో రిజర్వాయర్ కు వచ్చి చేరుతుంది. దీంతో 23 అడుగులు గరిష్ట నీటి మట్టానికి ప్రస్తుతం 25 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజుల నుండి 18 ఫాలింగ్ గేట్ల(18 falling gates) నుండి దిగువకు నీటిని వదులుతుండగా, ఫాలింగ్ గేట్ల పక్క ఉన్న సైడ్ వాల్ మీది నుండి కూడా నీరు ప్రవహిస్తూ ఉంది.

ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District)లో పడుతున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఆకేరు, మున్నేరు పొంగి ప్రవహిస్తుండగా, పాలేరు జలాశయం పై దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. పాలేరు పరివాహక ప్రాంతాలైనటువంటి కొన్ని గ్రామాల పై అధికారులు దృష్టి సారించి వారిని అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరో వైపు ఖమ్మంలో మున్నేరు నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో మున్నేరు నది 25 అడుగులతో ప్రవహిస్తోంది. మున్నేరున్నది ఉగ్రరూపం కారణంగా ఖమ్మం బోనకల్ రోడ్ లో దంసలాపురం వద్ద ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా రామకృష్ణాపురం(Ramakrishnapuram) వద్ద వరద నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ లో, ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, నాయుడుపేట వద్ద, కరుణగిరి వద్ద మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం వర్షాలు తగ్గు ముఖం పట్టినప్పటికీ వరి, మొక్కజొన్న(Maize), పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలలో నిమగ్నమయ్యారు.

Leave a Reply