టెక్నాలజీతో ఆదుకున్నాం…

- ఇది పెను విపత్తు
- తనష్టం అపారం
- సీఎం చంద్రబాబు ఆవేదన
మొంథా తుఫానుతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈదురు గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఏపీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియల్ విజిట్ అనంతరం ఆయన ఓడలరేవు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అల్లవరం మండలం బెండ మూర్లంక, ఓడలరేవు చేరుకున్నారు.
వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. ధాన్యం చేతబట్టుకుని దెబ్బతిన్న పంట నష్టంపై ఆరా తీశారు. రైతులు, అధికారులతో స్వయంగా మాట్లాడారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. కొన్ని జిల్లాల్లో వరి, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయన్నారు.
టెక్నాలజీ సాయంతో సహాయ చర్యలు చేపట్టాం..తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది.. సత్వరమే స్పందించి చాలా వరకు నష్టాన్ని నియంత్రించగలిగాం, మొంథా తుఫానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణనష్టం లేకుండా చూశాం, గతంలో వచ్చిన హరికేన్ లాంటి తుఫాన్ వచ్చి ఉంటే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యేవో ఊహించలేం అని సీఎం వివరించారు.
మొంథా తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని చాలా వరకు ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని, ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. 2200 క్యాంపులు ఏర్పాటు చేసి 1.80 లక్షల మందికి పునరావాసం కల్పించామని, అర్థరాత్రి 1 వరకు పరిస్థితిని పర్యవేక్షించామన్నారు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దామని స్వయంగా వచ్చాను, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను ఆపాం.. తిరిగి పునరుద్ధరించాం , 4 సబ్ స్టేషన్లు మినహా అన్ని సబ్ స్టేషన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశాం, గవర్నెన్స్ ద్వారా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్లు, అధికారయంత్రాంగం సమిష్టిగా పనిచేశారు, ఇద్దరు మినహాయించి ఎక్కడా ప్రాణ నష్టం సంభవించలేదు..పరిహారం చెల్లించే విషయంపై ఆదేశాలిచ్చాం..
త్వరలోనే అందిస్తాం, వరి పంట, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పర్చూరులో పంటలు నీట మునిగాయి..కోనసీమలో 70-75 కి.మీల వేగంతో గాలులు వీచాయి..ఈ క్రమంలో పెను ప్రమాదం తప్పింది..కొంత మేర నష్టం సంభవించింది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆస్తి నష్టం లెక్కలు తెప్పించుకొని పరిహారం అందిస్తాం, నష్టపరిహారం కౌలు రైతులకు వస్తుంది, అన్ని అంశాలపై సమీక్షించి స్పష్టమైన రిపోర్టులు తెప్పించుకొని పరిహారం అందిస్తాం అని సీఎం హామీ ఇచ్చారు.
పునరావాస కేంద్రాల్లో మూడు రోజుల పాటు భోజనం, వసతి విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, బాధిత ప్రజలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డ, కేజీ పంచదార అందించామన్నారు. వేట నిషేధం నేపథ్యంలో మత్స్యకారులకు, అదే విధంగా చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నాం అని సీఎం వివరించారు.
